మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో తెల్లవారుజామున సుమారు గంటకుపైగా ఎడతెరిపి లేకుండా జల్లు పడింది. అకాల వర్షం కారణంగా ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలు జలమయమయ్యాయి. ధాన్యం, మక్కల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. రాసులుగా పోసిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది.
అకాల వర్షం... రైతన్నకు మిగిల్చింది అపార నష్టం
అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వరద నీటికి కొట్టుకుపోయింది.
అకాల వర్షం... రైతన్నకు మిగిల్చింది అపార నష్టం
ధాన్యం రాశులపై రైతులు టార్పారిన్లు కప్పగా... గాలి ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలను రెండు నెలలుగా కాపాడుకుంటున్నామని... కొలిచిన ధాన్యాన్ని తరలించకపోవటం వల్లే నేడు ఈ నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. మరికొంతమందికి గోనె సంచులు ఇవ్వకపోవటం వల్ల ధాన్యపు రాశులు నీట మునిగాయని గోడు వెళ్లబోసుకున్నారు. తడిసిన ధాన్యానికి మద్ధతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.