Food Festival in Bayyaram School: బడి అంటే చదవడం.. రాయడం.. మానసికోల్లాసానికి ఆటలు ఆడుకోవడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెబుతాం. అదే మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మాత్రం వీటన్నింటితో పాటు మరొకటి కూడా నేర్పిస్తున్నారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏఎల్టీ జీవీ రమణమ్మ ఆధ్వర్యంలో పిల్లలకు ఆర్మీలో మాదిరిగా అన్ని రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే వంటలు ఎలా తయారు చేయాలనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలలో ఏడాదికొక్కసారి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి పిల్లలతో వంట ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. ఒక్కో తరగతి విద్యార్థినులతో రెండు రకాల వంటలను తయారు చేయిస్తున్నారు. విద్యార్థినిలు క్యారెట్ హల్వా, పాయసం, రవ్వ లడ్డూలు, జొన్నరొట్టెలు, పూరీలు, మిర్చి బజ్జీలు ఇలా రకరకాల పిండి వంటలు చేశారు.
చిన్నారులు ఉత్సాహంగా పోటీపడి మరీ తమ చేతులతో వంటలను ఎంతో రుచికరంగా తయారు చేసి అబ్బురపరిచారు. ప్రైవేటు పాఠశాలల్లో అధికంగా నిర్వహించే ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే సర్కారు బడిలో నిర్వహించడం ఎంతో సంతృప్తినిస్తోందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయకుమారి పేర్కొన్నారు. పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 130 మంది బాలికలున్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా తరగతి వారీగా ఒక్కో విద్యార్థిని రూ.5 నుంచి రూ.30 వరకు పోగు చేసుకుని వారు చేయాలనుకున్న వంటలకు అయ్యే సామగ్రిని కొనుగోలు చేసుకుంటారు.