Folk Singer Varalakshmi: మహబూబాబాద్ కేసముద్రం బేరువాడకు చెందిన వరిపల్లి వరలక్ష్మీ... అలియాస్ వరంకు చిన్నప్పటి నుంచి పాటలంటే ప్రాణం. బాల్యంలో తండ్రి పద్యాలు పాడుతుంటే... తానూ రాగం కలుపుతుండేది. నేర్చుకున్న పాటల్ని పాఠశాలలో పాడి ప్రశంసలందుకుంటుండేది. అలా పాటలపై అమితమైన ప్రేమను పెంచుకోంది.... వరం. సామాన్య జన హృదయాలకు చేరువయ్యేలా, వినసొంపుగా పాడటం ఆమె ప్రత్యేకత. ఇలా ఆమె పాడిన జానపదాలు ఎన్నో.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న చాలా జానపదాలకు తన గొంతును అరువిచ్చింది... ఈ యువ గాయని.
హాకీలోనూ కూడా..
పాటల్లోనే కాదు హాకీ క్రీడలోనూ వరలక్ష్మీకి ప్రవేశం ఉంది. తన సీనియర్లు మైదానంలో హాకీ కర్రలతో పరుగులు పెట్టడం చూసి.. ఆ ఆటపై ఆసక్తి పెంచుకుంది. తనూ ఓ హాకీ కర్ర పట్టుకుని... మైదానంలోకి దిగిపోయింది. అప్పటి నుంచి పాటలతో పాటు హాకీ కూడా ఆమె జీవితంలో భాగం అయిపోయింది. ఇంటర్ చదువుతున్నప్పుడే.. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. ప్రస్తుతం.. ప్లే బ్యాక్‌లో రాణిస్తూనే సీనియర్ నేషనల్స్ కోసం ప్రాక్టీస్ చేస్తోంది. బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదివేందుకు నగరానికి వచ్చిన వరం.. ఖైరతాబాద్‌లో సింగర్ హేమచంద్ర తల్లి శశికళ దగ్గర సంగీతం నేర్చుకుంది. నెమ్మదిగా సంగీత ప్రపంచానికి దగ్గరగా చేరువైంది. తన గాత్రం విన్న సంగీత దర్శకుడు బోలే షావలీ సినిమాలో పాడే అవకాశం కల్పించారు. హామ్ తుమ్ అనే చిత్రంతో పాటల ప్రయాణం ప్రారంభించింది వరం.
వరుసగా సినిమాల్లో అవకాశం
30కి పైగా చిన్నచిన్న సినిమాల్లో పాటలు పాడినా.. అవేవీ జనాదరణ పొందలేదు. 2016లో ఓ న్యూస్ ఛానల్ కోసం పాడిన బతుకమ్మ పాట అద్భుత ఆదరణ దక్కించుకుంది. అప్పటి నుంచి.. వరుసగా ఆ ఛానల్ కోసం జానపదాలు పాడి.... ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆస్ట్రేలియా, ఆబుదాబి దేశాలకు సైతం వెళ్లి ప్రదర్శనలిచ్చింది. గాయనిగా వరలక్ష్మీకి పేరు రావడంతో... దర్శకుడు బోయపాటి శ్రీను దృష్టిలో పడింది. వెంటనే ఎన్నికల కోసం దర్శకుడు ఆమెతో ఓ పాటను పాడించారు. అది విన్న సంగీత దర్శకుడు మణిశర్మ గారు వరలక్ష్మీకి వరుసగా సినిమాల్లో అవకాశం కల్పించారు. అలా... ఇస్మార్ట్ శంకర్, సిటీమార్, ఆర్ఎక్స్100, నారప్ప వంటి బడా సినిమాలకు పాటలు పాడే అవకాశం దక్కించుకుంది. చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా మోషన్ పోస్టర్ కోసం చిన్న బిట్ సాంగ్ పాడింది.