Floods Effect in Telangana 2023 : రాష్ట్రంలో కుండపోతగా కురిసిన వర్షాలు.. అన్నదాతను అతలాకుతలం చేశాయి. మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గినా.. మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి వాగుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇరువైపులా ఉన్న పంట పొలాలుదెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలాల్లో అమర్చిన మోటార్లు, స్టాటర్లు కొట్టుకుపోయాయని.. వరి నాట్లు వేసిన 10 రోజులకేవరదలు రావడంతో ఒక్కొక్క రైతు రూ.20 నుంచి రూ.30 వేల వరకు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 6 వేల ఎకరాలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
"ఇక్కడ ఉన్న పొలాలు మొత్తం వాగుల పక్కనే ఉన్నాయి. ఒక్కొక్క రైతుకు ఎకరన్నర నుంచి రెండు ఎకరాలు మాత్రమే పొలం ఉంటుంది. అంతకు మించి పెద్ద రైతులు లేరు. నాట్లు వేసి ఐదారు రోజులు మాత్రమే అవుతోంది. ఎప్పుడూ రానంతా వర్షాలు, వరదలకు పొలంలో అంతా ఇసుక మేట వేసింది. ఇప్పుడు మళ్లీ పొలం తిరిగి వేసుకోవాలనుకున్నా గానీ, నారు దొరికే పరిస్థితి లేదు. అదేవిధంగా ఒకవేళ ధైర్యం చేసి పంట వేద్దాం అనుకున్నా ఈ ఇసుకలో ట్రాక్టర్ నడవదు. ఎండాకాలం పంటకు మాత్రమే ఇప్పుడు ఈ భూమి పని చేసేలా ఉంది. పొలం మొత్తం శుభ్రం చేసి ఒక లెవల్‌కు తీసుకొస్తేనే నాట్లకు పని చేస్తుంది. కొంతమంది ఇవన్నీ వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయారు." -బాధిత రైతు