ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలంటూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి రైస్ మిల్లు ముందు రైతులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రైస్ మిల్లు ముందు వాహనాలు బారులు తీరాయి. కేసముద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ నిర్వాహకులు.. రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి కాంటాలు వేశారు.
అకాల వర్షాలు పడే అవకాశం ఉండటం.. లారీలు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో రైతులు కిరాయి ట్రాక్టర్లలో ధాన్యాన్ని కోరుకొండపల్లి శివారులోని ఓ రైస్ మిల్లుకు తరలించారు. కానీ మిల్లు నిర్వాహకులు ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యాన్ని దిగుమతి చేసుకోకపోవడంతో ట్రాక్టర్ల కిరాయి పెరిగిపోతోందని, ఇక్కడ సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం దిగుమతికి చర్యలు తీసుకోవాలని కోరారు.