మనసుంటే మార్గం ఉంటుందంటారు పెద్దలు.. అలాంటి మంచి ఆలోచన పురుడు పోసుకుంది మహబూబాబాద్ కలెక్టర్ శశాంక మదిలో.. ఏజెన్సీ ప్రాంతాల్లో మాములు రోజుల్లోనే ఇబ్బందులు తప్పవు.. పైగా వానాకాలం.. గర్భిణులు.. కాన్పు కష్టాలు తలెత్తిత్తే పరిస్థితి చేయిదాటే ప్రమాదముంది. అందుకే కాబోయే అమ్మలకు కష్టాలు తలెత్తొద్దంటూ మహబూబాబాద్ జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. రెండు వారాలలోపు ప్రసవం అయ్యే అవకాశం ఉన్నవారిని గుర్తించి స్థానిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్‌సీ)లకు తరలించాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా 21 పీహెచ్‌సీల పరిధిలో 131 మంది గర్భిణులను వైద్యాధికారులు గుర్తించారు. వారందరినీ స్థానిక ఆరోగ్య కేంద్రాలు, రహదారి సౌకర్యం సక్రమంగా ఉన్న బంధువుల ఇళ్లకు తరలిస్తున్నారు. ఇలా సోమవారం 20 మందిని సురక్షితంగా చేర్చినట్లు వైద్యాధికారి డా.హరీశ్‌రాజ్ తెలిపారు. డోర్నకల్ పీహెచ్‌సీకి ముగ్గురు, కొత్తగూడ, ఇనుగుర్తి, కంబాలపల్లి, తొర్రూరు, పీహెచ్‌సీలకు ఇద్దరు చొప్పున, బయ్యారం, మరిపెడ, తీగలవేణి, నెల్లికుదురు పీహెచ్‌సీకి ఒక్కరు చొప్పున 108, 102 వాహనాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల సహాయంతో తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. గర్భిణులకు తోడుగా కుటుంబసభ్యుల్లో ఒకరు ఉండేలా అనుమతిస్తూ, భోజన సౌకర్యం కల్పించామన్నారు. ఆసుపత్రికి రాలేనివారిని బంధువుల ఇళ్లలో ఉండాలని చెప్పడంతో వారు అక్కడికి వెళ్లారన్నారు. భూపాలపల్లి జిల్లాలోని పలిమెల, మహాముత్తారం, మహాదేవ్‌పూర్ మండలాల్లోనూ 8 మంది గర్భిణులను ముందుగానే పీహెచ్‌సీలకు తరలించినట్లు అ జిల్లా వైద్యాధికారి తెలిపారు.