తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (టీఎస్‌ఐసీ), యూనిసెఫ్, ఇంక్వి-లాబ్ ఫౌండేషన్ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా నుంచి 123 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ ప్రక్రియలో తొలుత ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులకు శుక్రవారం ఇవ్వనున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని ఆలోచనలను వెలికి తీసి వివిధ సమస్యలకు పరిష్కారాలను కనుగొనే దిశగా ఆవిష్కరణలకు ప్రోత్సహించాల్సి ఉంటుంది.
ఉపాధ్యాయులకు శిక్షణ
ఈ కార్యక్రమంలో తొలుత నమోదు చేసుకున్న పాఠశాలల్లోని ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల నుంచి ఒక ఉపాధ్యాయుడిని ఎంపిక చేశారు. ఆకృతి ఆలోచనల పద్ధతులు, ప్రక్రియపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి సంబంధించి విద్యార్థుల బృందాలను గుర్తిస్తారు. టీ-శాట్, వాట్సాప్, యూట్యూబ్‌ల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. జిల్లాలో ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు శిక్షణ ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ తెలిపారు.