తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధి నిధులతో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు

మాతాశిశువులకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో చాలా వరకు సొంత భవనాలు కరవయ్యాయి. అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణాలు, ఇతర వసతులు కల్పించేందుకు ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవాలని సూచించారు. ఈ విషయమై గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా ఆదేశించారు.

By

Published : Jul 18, 2020, 8:59 AM IST

employment-scheme-funds-will-be-used-to-build-anganwadi-centers-in-telangana
ఉపాధి నిధులతో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు

మహబూబాబాద్​ జిల్లాలో 1,437 అంగన్వాడీ కేంద్రాలుంటే వీటిలో కేవలం 312 కేంద్రాలు మాత్రమే సొంత భవనాల్లో నడుస్తున్నాయి. ఆ సొంత భవనాల్లోనూ మౌలిక వసతులు అంతంతమాత్రమే. దశాబ్ద కాలం కిందట నిర్మించిన భవనాలు కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్నింటిలో ప్రహరీ, వంటగదులు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేదు. తలుపులు, కిటికీలు కూడా కనిపించడం లేదు.

ప్రభుత్వ పాఠశాలల్లో, అద్దె లేకుండా నడిపిస్తున్న 692 కేంద్రాల్లోనూ కొన్ని భవన సముదాయాల్లో మాత్రమే అన్ని వసతులు ఉంటే ఇతర కేంద్రాల్లో కనిపించడం లేదు. కొన్ని గ్రామాలు, తండాల్లో వివిధ పథకాల ద్వారా భవన నిర్మాణాలు ప్రారంభించి మధ్యలోనే వదిలివేయడంతో నిరూపయోగంగా మారాయి.

  • జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు: 1437
  • సొంత భవనాలు ఉన్న కేంద్రాలు: 312
  • ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న కేంద్రాలు: 692
  • అద్దె గృహాల్లో ఉన్న కేంద్రాలు: 433

సమగ్ర నివేదిక సిద్ధం చేస్తాం

జిల్లాలో అద్దె ఇంట్లో ఉన్న కేంద్రాలను గుర్తించి సొంత భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు చేస్తాం. సొంత భవనాలున్న కేంద్రాల్లోనూ శిథిలమైన భవనాలను గుర్తిస్తాం. ఇంకా వీటిలో ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలో అవసరమైన వాటిని ప్రతిపాదిస్తూ నివేదికను ప్రాజెక్టుల వారీగా తయారు చేయిస్తున్నాం.

- సంధ్యారాణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి

ప్రాజెక్ట్‌ల వారీగా మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన కేంద్రాలు

  • మహబూబాబాద్‌: 50
  • గూడూరు: 55
  • మరిపెడ: 23
  • డోర్నకల్‌: 25
  • తొర్రూరు: 36

నెలకు రూ.లక్షల్లో అద్దెల చెల్లింపు..

అంగన్వాడీ కేంద్రాలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000, పురపాలక సంఘాల్లో రూ.2,500-4,000వేల వరకు అద్దెల రూపేణా నెలనెలా లక్షలాది రూపాయలు కిరాయి చెల్లిస్తున్నారు. ఏడాది కిందట జిల్లాలో సుమారు 70కి పైగా కేంద్రాలను ఈజీఎస్‌ పథకం నిధుల ద్వారా నిర్మించాలని రెండు విడతలుగా సుమారు రూ.80లక్షలు మంజూరు ఇచ్చినా సంబంధిత ఇంజినీరింగ్‌ శాఖాధికారులు ముందుకు రాకపోవడంతో ఆ పనులకు మోక్షం లభించలేదు. ఈజీఎస్‌ పథకంలో నిధులు కేటాయిస్తుండడంతో అన్ని కేంద్రాలకు సొంత భవనాలు, పాత భవనాలకు మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details