సంక్షేమ ఫలితాలు పేదలకు అందేలా చూసేందుకు ప్రతిఒక్కరు ముందుకు రావాలని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలుపై దాడులు, అత్యాచారాలపై ఏర్పాటైన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
అస్పృశ్యత లేకుండా చూడాలని.. ఎక్కడైనా పాటించనట్లయితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో విద్యార్థుల భోజనం, విద్యపై సంక్షేమ శాఖ అధికారులు దృష్టిసారించాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 20 కేసులను నెలలోపు పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని మహబూబ్‌నగర్‌లో నిర్వహించేందుకు ఏర్పాటుచేస్తామని వెల్లడించారు.
కమిషన్ ద్వారా 2019 నాటికి ఎస్టీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో బాధితులకు రూ.43 కోట్లు పరిహారాన్ని ఇచ్చామని ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. కేసుల పరిష్కారంలో బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీపై ఉందని గుర్తుచేశారు. 90 రోజుల్లో కేసులు పరిష్కరించాలని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి తమకు 108 ఫిర్యాదులు వచ్చాయని.. వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు.
హరితహారం సన్నాహక సమావేశం..