waiting for disability pension: కలెక్టర్ గారు.. మేము అందరి పిల్లల మాదిరిగా లేము.. మా శరీరాలు దృఢంగా లేవు.. మా చేతివేళ్లు దేనిని పట్టుకోలేవు.. మా కాళ్లు అగుడు వేయలేవు.. కుర్చోబెట్టిన చోటునుంచి అడుగు దూరం కూడా నడవలేని దుస్థితి మాది.. ఊహతెలియని వయసులోనే జన్యుపరమైన లోపంతో మా శరీరంలో ఎదుగుదల లోపించింది. బక్కపలచని శరీరంతో మంచానికే పరిమితమ్యయ్యాం. ఏ పని చేసుకోవాలన్నా ఎవరో ఒకరి తోడు కావాల్సిందే.. కాసేపు అమ్మ ఒడిలో సేదదీరేది కూడా మందులు వేసుకోడానికి అనిపించే పరిస్థితి మాది. ఇళ్లు నడిపేందుకే అరకొరగా సరిపోయే నాన్న కూలి డబ్బులు.. నాకు కనీసం మందులు కొనడానికి చాలా ఇబ్బంది తెచ్చిపెడుతుంది. అమ్మ పుస్తెలతాడుతో సహా తాకట్టు పెట్టి నన్ను బాగు చేయడానికి చేయని ప్రయత్నం లేదు.. నేను ఎందుకు ఇలా ఉన్నాను.. నేను చేసిన తప్పిందం ఏమిటో తెలియదు.. ప్రభుత్వం నుంచి సాయం వస్తుందని తెలిసి ఎన్నో ఏళ్లుగా మా అమ్మానాన్న ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మీ దగ్గర కొస్తేనైనా పని జరుగుతుంది ఆశతో వచ్చాము.. మీరే మాపై దయచూపించి ఆదుకుంటారని మా విజ్ఞాపన..
మంచానికే పరిమితమైన ఇద్దరు బిడ్డలు
డోర్నకల్ మండలం ముల్కలపల్లికి చెదిన జక్కుల నగేశ్ రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. ముగ్గురు పిల్లలు ఉన్నా ఆ ఇంట ఏదో బాధ ఆవరించి ఉంది. పిల్లల అల్లరితో సందడిగా ఉండాల్సిన ఆ ఇల్లు ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. మూడేళ్ల వ్యవధిలో జన్మించిన ఇద్దరు కుమార్తెలు పుట్టినప్పటి నుంచి జన్యుపరమైన లోపంతో బాధపడుతున్నారు. శారీరకంగా ఎదుగుదల లేకపోవడం, కాళ్లూ చేతులు చచ్చుబడి సరిగా నిల్చోలేరు... కూర్చోలేని పరిస్థితి. మంచానికే పరిమితమైన వారిని నిత్యం కంటిపాపలా కాచుకుంటూ ఉండాల్సిందే.. పెద్దమ్మాయి గీతాలక్ష్మికి తొమ్మిదేళ్లు.. ఇప్పటికీ పొత్తిళ్లలో పాపాయిలా చూసుకోవాల్సిందే.. మూడేళ్ల తేడాతో జన్మించిన మరో అమ్మాయి నోవికాది కూడా అదే పరిస్థితి. ఆమె కాళ్లు, చేతులు కదల్చలేదు. చిన్నారులిద్దరినీ హైదరాబాద్లోని ఆస్పత్రిలో చూపించగా.. జన్యుపరమైన లోపమని వైద్యులు నిర్ధరించారు. వారికి నిత్యం మందులు వాడాల్సిందే.. ఇప్పటికే వారి వైద్యం కోసం అన్నీ అమ్ముకుని సుమారు రూ.8 లక్షల వరకు ఖర్చుచేశారు. ఇక అమ్మడానికి కూడా వారి వద్ద ఏమీలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు తల్లిదండ్రులు. సదరం ధ్రువపత్రం ఉన్నప్పటికీ ఇప్పటీకీ ఎటువంటి ఫించన్ రావడంలేదని వాపోతున్నారు.
పుట్టినప్పుడు 4కిలోలు.. ఆరేళ్లకు 8కిలోలు