తెలంగాణ

telangana

ETV Bharat / state

పక్కాగా పంటల సాగు వివరాలు... అంతర్జాలంలో నమోదు

మహబూబాబాద్​ జిల్లాలో రైతులు సాగుచేస్తున్న పంటల వివరాల నమోదు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. పంటల సాగు నమోదు ఆధారంగానే భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ ప్రక్రియతో అన్నదాతలకు ప్రయోజనం చేకూరనుంది. గతేడాది వానాకాలంలో పంటల వివరాలు సక్రమంగా నమోదు చేయించుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట నమోదు ఒకటైతే.. విక్రయానికి మరో పంట తీసుకెళ్లడంతో కొనుగోలు సమయంలో అవస్థలు పడ్డారు. ఇప్పటికే వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించడం ప్రారంభించారు. ఈ నెలాఖరులోగా రైతుల నుంచి పంటల వివరాలను నమోదు చేయాలని ఉన్నతాదికారులు ఆదేశించినట్లు తెలిసింది.

crop cultivation details registration programme  in mahabubabad district
పక్కాగా పంటల సాగు వివరాలు... అంతర్జాలంలో నమోదు

By

Published : Jul 23, 2020, 10:19 AM IST

మహబూబాబాద్‌ జిల్లాలోని 16 మండలాల్లో 1,88,903 మంది రైతులున్నారు. వానాకాలం సీజన్‌లో పత్తి, వరి, మిరప, కంది, మినుము, పెసర పంటలు, యాసంగిలో వరి, జొన్న, వేరుసెనగ, మొక్కజొన్న పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పంటల సాగు వివరాలను నమోదు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినా.. అప్పట్లో ఎలాంటి సాగు లేకపోవడంతో సాధ్యం కాలేదు. ప్రస్తుతం పంటలన్నీ మొక్క దశలో ఉన్నాయి. దీంతో సాగు వివరాలు పక్కాగా అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

రైతులకు సంక్షిప్త సందేశం..

పంట వివరాలు నమోదు చేసుకునే సమయంలో రైతుల చరవాణి సంఖ్యలను సైతం వ్యవసాయాధికారులు సేకరిస్తున్నారు. పంట వివరాలు, సాగు చేసే రకం, అంతర్‌పంట వివరాలు, విస్తీర్ణం, యంత్ర పద్ధతిలో సాగు చేస్తున్నారా? కాడెద్దులతో సాగు చేస్తున్నారా? సాగుకు సంబంధించిన పరికరాలున్నాయా? తదితర పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. పంటల సాగు వివరాల సందేశాన్ని వ్యవసాయశాఖ నుంచి రైతులకు పంపిస్తారని అధికారులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో పంటల వివరాల నమోదుపై క్లస్టర్‌ ఏఈఓలు, ఏఓలకు అధికారులు అవగాహన కల్పించారు.

నమోదు చేసుకుంటేనే మద్దతు ధర..

అంతర్జాలంలో పంటల వివరాలను నమోదు చేసుకుంటేనే ఇక నుంచి కొనుగోలు కేంద్రాల్లో పంటలకు మద్దతు ధర లభించే అవకాశముంది. సదరు రైతు వరి సాగు చేస్తుంటే ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు. దిగుబడి అంచనా ఎంత.. ఇలాంటి వివరాలు నమోదు చేయిస్తేనే కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కొంటారు. నమోదు కాకపోతే తిరస్కరిస్తారు. ఇలాంటివి జరగకుండా అధికారులు గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి క్షుణ్నంగా పరిశీలించి నమోదు చేస్తున్నారు.

రైతులు సహకరించాలి

-ఛత్రునాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి

పంటల వివరాల నమోదుకు రైతులు అధికారులకు సహకరించాలి. ఏఓలు, ఏఈఓలు రైతుల వద్దకే వస్తారు. వారి వద్ద పంటల వివరాలను పక్కాగా నమోదు చేయించుకోవాలి. తద్వారా ఎరువులు, క్రిమిసంహారక మందుల అవసరత వంటి వివరాలు పక్కాగా తెలుస్తాయి. రైతులు తమ ఉత్పత్తులను మద్దతు ధరలకు విక్రయించుకోవడం సులభతరం అవుతుంది. జిల్లాలో ప్రస్తుత గణాంకాల ప్రకారం 1,88,903 మంది రైతులు ఉండగా పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్న రైతులు 1,62,756 మంది ఉన్నారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు అందిచేలా చర్యలు చేపట్టాం.

ఇవీ చూడండి: వ్యవసాయంలో మౌలిక మార్పులకే రైతు వేదికలు: సత్యవతి రాఠోడ్‌

ABOUT THE AUTHOR

...view details