మహబూబాబాద్ జిల్లాలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. జిల్లాలో తొలి 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడానికి 96 రోజులు పట్టగా, అనంతరం మరో 50 కేసులు నమోదు కావడానికి 11 రోజులే పట్టింది. శరవేగంగా కరోనా వైరస్ విస్తరిస్తుందనేందుకు ఇదే నిదర్శనం. గడచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా నోడల్ అధికారి వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు జిల్లాలో 122 మంది కరోనా బారినపడ్డారు. 933 మంది నమూనాలు సేకరించగా 122 కేసులు నమోదయ్యాయి. 58 ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. వీరిలో 26 మంది డిశ్చార్జ్ కాగా, ముగ్గురు మృతి చెందారు. 86 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతుండగా, ఏడుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురు, శుక్ర వారాల్లో పాజిటివ్ కేసులు నమోదైన వ్యక్తులలో పోలీస్, వైద్య సిబ్బంది ఎక్కువగా ఉన్నారు.
లాక్డౌన్తో కట్టడిలో ఉన్న కరోనా
ప్రభుత్వం మార్చి 23 నుంచి లాక్డౌన్ ప్రారంభించి కఠినంగా అమలుచేసింది. జిల్లాలో ఏప్రిల్ 3న దిల్లీ మర్కజ్ యాత్రకు వెళ్లి వచ్చిన వ్యక్తికి తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. లాక్డౌన్తో కరోనా కట్టడిలో ఉంది. మే నెలలో క్రమంగా లాక్డౌన్ నిబంధనలను సడలించడం వల్ల బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు క్రమంగా జిల్లాలోని సొంత గ్రామాలకు చేరుకున్నారు. దీంతో జిల్లాలో క్రమంగా కేసులు పెరుగుతూ వచ్చాయి. జిల్లాలో రెండో కరోనా కేసు నమోదు కావడానికి 48 రోజులు పట్టింది. అధికారులు వలసకూలీలు వచ్చిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కడికక్కడ ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి వాళ్లను హోమ్ క్వారంటైన్ చేయడం వల్ల 25 కేసులు నమోదు కావడానికి 88 రోజులు పట్టింది. ప్రభుత్వం పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేయడం... జన సంచారంపై ఎటువంటి ఆంక్షలు విధించకపోవడం వల్ల జిల్లాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందడం మొదలైంది.