TSRTC Conductor Suicide in Bus : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ డిపోలో నిలిపి ఉంచిన ఓ బస్సులో డ్యూటీలో ఉన్న కండక్టర్ గార్లపాటి మహేందర్ రెడ్డి అనే (55) వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య అరుణ, కుమారులు విక్రమ్, వినయ్‌లు ఉన్నారు. అనారోగ్యంగా ఉండటంతో ఈ నెల 9 నుండి 12వ తేదీ వరకు మహేందర్ సెలవు మంజూరు చేయించుకున్నారు. ఆదివారం వరకు సెలవు ఉన్నా నిన్న ఉదయం 11 గంటలకు డిపోకు వచ్చిన మహేందర్ డ్యూటీ వేయించుకుని అప్పటి నుంచి కనిపించకుండాపోయాడు. సిబ్బంది ఫోన్ చేసినా స్పందించలేదు. చివరకు డిపో ఆవరణలో పార్కింగ్ చేసి ఉన్న ఓ బస్సులో తన టవల్‌తో ఉరి వేసుకుని కనిపించాడు.
Thorrur RTC Conductor Suicide in Bus: సిబ్బంది వెంటనే పై అధికారులకు విషయం చెప్పారు. వారు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మహేందర్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యాజమాన్యం ఎంత వేధించిందో..: మహేందర్ రెడ్డి విధి నిర్వహణలో ఉండి.. బస్సులోనే ఉరి వేసుకోవడం తీవ్ర బాధను కలిగించిందని జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.కమల్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడిని యాజమాన్యం ఎంత వేధిస్తే ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడో అని ఆందోళన వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పరిహారం అందించి ఆదుకోవాలన్నారు.