కోచ్ ఫ్యాక్టరీపై సరైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు : బండి మీరంతా ఓట్లు వేసి సీఎం పదవిని కేసీఆర్కు కట్టబెడితే... ఆ పదవి చెప్పుతో సమానమని కేసీఆర్ అన్నారని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. తెరాసకు ఓటు వేస్తే చెప్పుకు ఓటు వేసినట్లేనని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన భాజపా పట్టభద్రుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంటి బాణాసంచా కాలుస్తూ నందన గార్డెన్వరకు భారీ ర్యాలీ కొనసాగించారు. అబద్ధాలు ఆడటంలో కేసీఆర్, కేటీఆర్ మొదటి స్థానంలో ఉంటారని బండి సంజయ్ పేర్కొన్నారు. గిరిజనులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తుంటే లాఠీఛార్జ్ చేస్తున్నారని మండి పడ్డారు.
స్థలం కేటాయించలే
2014లో ఎన్డీఏ ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం స్థలం మంజూరు చేయకపోవడంతో అది వేరే రాష్ట్రానికి తరలిపోయిందన్నారు. న్యాయం జరగాలని వ్యాగన్ ట్రాక్ ఇచ్చారని.. 2017 వరకు దానికి స్థలాన్ని కేటాయించలేదని చెప్పారు. కిషన్ రెడ్డి, తాను తిడితే ఎండోమెంట్ స్థలాన్ని ఇచ్చారని పేర్కొన్నారు.
పేదలంతా ఎదురుచూపు
పోడు భూములకు పట్టాలు ఇస్తామని అంటున్నారని.. కానీ ఇప్పటివరకూ ఇచ్చారా అని ప్రశ్నించారు. పంట చేతికి వచ్చే సమయంలో పంట చేలపైకి సీఎం ఫారెస్ట్ అధికారులను పంపిస్తున్నారని మండి పడ్డారు. హరితహారానికి కూడా ఫారెస్ట్ భూములే దొరికాయా అని ఎద్దేవా చేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పేదలు గెలిపించారని పేర్కొన్నారు. ఇప్పుుడు మేధావులు గెలిపిస్తారా.. గెలిపించరా అని పేదలంతా ఎదురుచూస్తున్నారని అన్నారు.
కొట్లాట జరుగుతుంది
అవినీతికి పాల్పడ్డారని పీఆర్వోను తొలగించారని బండి సంజయ్ వెల్లడించారు. ఇన్ని సంవత్సరాలకు పక్కన ఉన్న వ్యక్తి చేసిన అవినీతి కనపడిందా అని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇంట్లో వాటాల కోసం కొట్లాట జరుగుతుందని ఆరోపించారు. మానుకోట రాళ్లకు మళ్లీ పని చెప్పాలని కోరారు. మేధావులంతా మరోసారి ఆలోచించి, ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, రాష్ట్ర నాయకులు యెండల లక్ష్మీనారాయణ, బండారు శృతి, సంగప్ప, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఈ నెల 9న ఛలో హైదరాబాద్ కార్యక్రమం