తెలంగాణ

telangana

ETV Bharat / state

వీణావాణీలకు "కొత్త పరీక్ష"... అనుమతిలో చిక్కులెన్నో! - joint twins veena vani tenth hall ticket

తలలు అతుక్కుని పుట్టిన అవిభక్త కవలలు వీణా వాణీలకు కొత్త పరీక్ష ఎదురైంది. పదో తరగతి పరీక్షలు రాస్తున్న వీరికి ఒకే హాల్‌టికెట్‌ ఇవ్వాలా లేదా రెండు కేటాయించాలా అని పాఠశాల విద్యాశాఖ సందేహాం వ్యక్తం చేసింది. అనేక మల్లగుల్లాల తర్వాత ఈ సమస్య పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వద్దకు చేరింది. వైద్యారోగ్య శాఖను సంప్రదించి తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన నిర్ణయించారు.

Ambiguity on joint twins veena vani tenth hall ticket
వీణావాణీలకు హాల్​టికెట్ ఎలా ఇవ్వాలి?

By

Published : Dec 18, 2019, 9:39 AM IST

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలి వీరిశెట్టి గ్రామానికి చెందిన వీణావాణీలు 2003 అక్టోబరు 16న జన్మించారు. పుట్టినప్పట్నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, ఆ తర్వాత హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ వచ్చారు. ఆసుపత్రుల్లో ఉంటూనే విద్యాభ్యాసం కొనసాగించారు. పరీక్షలు రాస్తూ వచ్చారు. 2017 జనవరి నుంచి హైదరాబాద్‌ వెంగళరావునగర్‌ స్టేట్‌ హోంలోని బాలసదన్‌లో ఉంటున్నారు. విద్యాశాఖ కేటాయించిన ఉపాధ్యాయులు రోజూ అక్కడికే వెళ్లి బోధిస్తున్నారు.

ప్రవేశాలు వేర్వేరుగా...

మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వారికి వెంగళరావునగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2019లో పదో తరగతిలో ప్రవేశాలు కల్పించారు. ఆ సమయంలో వేర్వేరు (ప్రవేశాల సంఖ్య 5618, 5619) సంఖ్యలు కేటాయించారు. పదో తరగతిలో వార్షిక పరీక్షలు రాయాల్సి ఉండగా వారి సంసిద్ధతను విశ్లేషించాలని భావించిన మహిళా సంక్షేమ శాఖ ఓ కమిటీని నియమించింది. ‘‘ప్రభుత్వ పరీక్షలు రాసే సామర్థ్యం, అర్హత వారికి ఉంది. వయసు సమస్య కూడా లేదు’’ అని ముగ్గురు సభ్యుల కమిటీ తేల్చింది.

అనుమతిలో అనేక చిక్కుముళ్లు

కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మార్చి 19వ తేదీ నుంచి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలు రాసేందుకు వారికి అనుమతి ఇవ్వాలని, హాల్‌ టికెట్లు మంజూరు చేయాలని కోరుతూ హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారి.. ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్‌ఎస్‌సీ బోర్డు) సంచాలకుడు బి.సుధాకర్‌కు దస్త్రం పంపారు. విద్యాశాఖ కమిషనర్‌ ఆమోదం తీసుకుంటేనే అనుమతి ఇవ్వడంతోపాటు, హాల్‌ టికెట్లు జారీ చేస్తామని ఆయన సమాధానమిచ్చారు. దాంతో డీఈఓ సమస్యను పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాసాచారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయకుమార్‌తో చర్చించారు.

ఒకటే ఇవ్వాలా? రెండా?

శరీరాలు వేర్వేరు అయినా తలలు అతుక్కుని ఉన్న నేపథ్యంలో ఇద్దరికీ కలిపి ఒకే హాల్‌ టికెట్‌ ఇవ్వాలా? రెండు కేటాయించాలా? అసలు వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితి పరీక్షలు రాసేందుకు అనుకూలంగా ఉందా? ఇత్యాది సందేహాలు వ్యక్తమమయ్యాయి. ఈ విషయమై వైద్యారోగ్య శాఖ అభిప్రాయం కూడా తీసుకోవాలనే వారు నిర్ణయానికి వచ్చారు. వైద్యారోగ్య శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవీ చూడండి: పండగలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

ABOUT THE AUTHOR

...view details