తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆడపిల్ల అని తెలియగానే.. పేగుబంధాన్ని తెంచేస్తున్న తల్లి! - abortions in mahabubabad district

నవమాసాలు మోసి జన్మనివ్వాల్సిన తల్లి కడుపులోనే పేగు బంధాన్ని తెంచుకుంటోంది. అమ్మ అనే పిలుపుతో పరవశించాల్సిన అపురూప క్షణాలను ఆస్వాదించకుండానే బిడ్డను పొట్టన పెట్టుకుంటోంది. కుటుంబం బలవంతం వల్లనో, ప్రస్తుత సామాజిక పరిస్థితుల వల్లో.. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలియగానే భూమి పైన పడకముందే చిదిమేస్తోంది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు కొందరు వైద్యుల కాసుల కక్కుర్తి ఈ పరిస్థితికి తోడవుతోంది.

abortions in mahabubabad district
మహబూబాబాద్ జిల్లాలో గర్భ విచ్ఛిత్తి

By

Published : Nov 5, 2020, 2:56 PM IST

మహబూబాబాద్​ జిల్లాలో ప్రతినెల పదుల సంఖ్యలో గర్భవిచ్చిత్తి జరగడం కలవరపరుస్తోంది. జిల్లాలో స్త్రీ, పురుష నిష్పత్తి జాతీయ, రాష్ట్ర సగటు కన్నా చాలా తక్కువ ఉందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ అన్నారు. ప్రతి 1000 మంది పురుషులకు 902 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారని తెలిపారు. మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చిన వారు.. రెండోసారి గర్భం దాల్చినప్పుడు స్కానింగ్​ చేయించుకుంటున్నారని చెప్పారు. ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్లకు పాల్పడుతున్నారని ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో ఇలాంటి చర్యలకు పాల్పడే ఆస్పత్రుల అనుమతి రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. జిల్లా ఏర్పడిన తరువాత ఇప్పటివరకు ఏ ఒక్కరూ అబార్షన్ చేయించుకుంటామని అనుమతి కోసం దరఖాస్తు చేసుకోలేదని, జన్యుపరమైన ఇబ్బందులు ఉంటే దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. 2020 సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రెండో కాన్పులో 36 మంది, మూడో కాన్పులో 20 మంది అబార్షన్లు చేయించుకున్నారని, కేసీఆర్ కిట్ల కోసం చేయించుకున్న నమోదును బట్టి తెలుస్తోందని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో అన్ని ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటు చేశామని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details