Inter Student Suicide in Mahabubabad District : తమ కుమారుడు బాగా చదివి డాక్టర్ అవుతాడనుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిలింది. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో వారు పట్టరాని దుఃఖంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ దుఃఖం నుంచి తేరుకోని ఆ తల్లిదండ్రులకు.. నిన్న విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో తమ కుమారుడికి 892 మార్కులు వచ్చినట్లు తెలియడంతో "ఈ మార్కులు ఎవరికి చెప్పుకోవాలి కొడుకా, బతికి ఉంటే బాగుండేది కదరా" అంటూ తమ బిడ్డ ఫొటోను పట్టుకొని గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన స్థానికలను కలచి వేసింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల శివారు బోడగుట్ట తండాకు చెందిన గుగులోత్ జ్యోతి, లచ్చు దంపతుల పెద్ద కుమారుడు గుగులోత్ కృష్ణ గత నెల ఏప్రిల్ 11వ తేదీన ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో.. తీవ్రమైన మానసిక ఒత్తిడి భరించలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచే చదువులో బాగా రాణిస్తున్న కృష్ణ.. కల్వలోని ఆదర్శ పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఏటూరు నాగారంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ బైపీసీ గ్రూప్లో చేరాడు. ఇంటర్ పరీక్షలు రాసి.. సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చాడు. కృష్ణ చిన్నప్పటి నుంచి ఎంబీబీఎస్ చదవి డాక్టర్ కావాలని కలలు కన్నాడు. తన కలలను నిజం చేసుకోవాలని కష్టపడి చదువుతూ వచ్చాడు.