మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, బస్ డిపో మేనేజర్ మహేష్‌లతో కలిసి ప్రారంభించారు. మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపో సమీపంలో ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ బస్సును నడుపగా, ఎంపీ మాలోత్ కవిత కండక్టర్ అవతారమెత్తి ప్రయాణికులకు టికెట్లను ఇచ్చారు.
మేడారం జాతరకు మహబూబాబాద్ నుంచి 100 బస్సులు, గూడూరు నుంచి 20 బస్సులను ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ మహేష్ అన్నారు. ప్రతి బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉంటారని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా టెంట్లు వేసి, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. ప్రతి 5-10 నిముషాలకు ఒక బస్సును నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.