Food Poison : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వానపాము పడిన పప్పు తిని.. 36 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అందులో 9 మంది ఆసుపత్రి పాలయ్యారు. గురువారం మధ్యాహ్న భోజన సమయంలో ఒక విద్యార్థినికి పప్పులో వానపాము వచ్చింది. తోటి విద్యార్థినులు ఈ విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ పప్పు తింటే ఏం కాదని వార్డెన్ చెప్పడంతో తామంతా తిన్నామని విద్యార్థినులు తెలిపారు.
భోజనం చేసిన వారిలో కొంత మందికి కడుపు నొప్పి రావడంతో వార్డెన్ మాత్రలు ఇచ్చారు. రాత్రి 12 గంటల సమయంలో మరికొందరు.. శుక్రవారం ఉదయం ఇంకొందరు కడుపునొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకోవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన 9 మందిలో ఒకరిని ఐసీయూలో ఉంచారు. మిగిలిన 27 మందికి వసతి గృహంలో పరీక్షలు నిర్వహించి ఔషధాలు అందజేశారు.