ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన యువరైతు శంకర్, డిగ్రీ పూర్తి చేశారు. తనకున్న మూడు ఎకరాల్లో టామటా, వంకాయ, గోబీ, అల్చింత, మిర్చి పంటలను పండిస్తారు. ఏడాదికి రూ.1.50 లక్షల పెట్టుబడి పెడుతున్నారు. రూ.5 లక్షల విలువగల పంటలను ఏడాది కాలంలో పండిస్తున్నారు. లాక్డౌన్ సమయం నుంచి కూరగాయల పంటలకు మరింత డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగానే వీటిని పండించడానికి కృషి చేస్తున్నానని శంకర్ పేర్కొన్నారు.
- సిర్పూర్(టి) మండలం బెంగాలీ క్యాంప్‌నకు చెందిన అనూప్ బిస్వాస్ తనకున్న రెండు ఎకరాల్లో తమలపాకు మొక్కలను పెంచుతున్నారు. వీటితో పాటు ఖర్జూర, వక్క (పోకలు)ల మొక్కలు సైతం నాటారు. పంటకు నిత్యం నీళ్లు ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. నజ్రుల్‌నగర్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌తో పాటు, మంచిర్యాల వరకు నిత్యం ఆకులను ప్యాక్ చేసి పంపిస్తున్నారు. నెలకు సుమారుగా రూ.20 వేల వరకు ఆదాయం వస్తుంది. ఖర్జూర, వక్క మొక్కలు చిన్నగా ఉన్నాయని ఇవి పెరిగితే అదాయం రెట్టింపవుతుందే ఆశాభావం అనూప్ వ్యక్తం చేశారు.
- రెబ్బెన మండల కేంద్రానికి చెందిన అజ్మీరా వస్రాం నాయక్ డిగ్రీ, బీఎడ్ పూర్తి చేశారు. సాగువైపు అడుగేసి రెండు ఎకరాల్లో కాకర, బీరకాయ, టమోటా పండించేవారు. బీరకాయ కోసం రూ.20వేల పెట్టుబడితో పంట వేశారు. మూడు నెలల్లోనే రూ.మూడు లక్షల వరకు లాభం వచ్చింది. కూరగాయలను మహారాష్ట్రలోని చంద్రపూర్‌తో పాటు, గోదావరిఖని, మంచిర్యాలకు మార్కెట్లకు తరలిస్తారు. తాజాగా జిల్లాలో ఎవరూ సాగు చేయని రీతిలో క్యారెట్‌ను పండిస్తున్నారు. ప్రస్తుతం కోతకు వచ్చింది. కూరగాయల సంరక్షణకు ఉద్యానవన అధికారుల సలహాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అజ్మీరా వస్రాం నాయక్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.