రెండు నెలల క్రితం అగ్ని సాక్షిగా మనోజ్.. పూజను పెళ్లి చేసుకున్నాడు. జీవితాంతం తోడుగా ఉంటానని ఏడు అడుగులు నడిచి మాట ఇచ్చాడు. ఏ కష్టం రాకుండా చూసుకుంటానని బాసలు చేశాడు. భర్తపై నమ్మకంతో కోటి ఆశలతో నవ వధువు అత్తారింట్లోకి అడుగుపెట్టింది. కానీ పెళ్లై రెండు నెలలు కూడా పూర్తికాకుండానే ఘోరం జరిగిపోయింది. పారాణి కూడా ఆరక ముందే నవ వధువు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.
వరకట్న వేధింపులకు.. నవ వధువు ఆత్మహత్య - వరకట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
వరకట్నం వేధింపులకు తట్టుకోలేక నవ వధువు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం నడ్డంగూడలో చోటు చేసుకుంది.
హస్నాపూర్ గ్రామానికి చెందిన పూజకు నడ్డంగూడకు చెందిన జాదవ్ మనోజ్ కుమార్తో రెండు నెలల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజులకే అదనంగా కట్నం తీసుకురావాలని భర్త, కుటుంబ సభ్యులు మానసికంగా వేధించారు. తీవ్ర మనస్తాపానికి గురైన పూజ అత్తగారి ఇంట్లోనే జులై 17న రాత్రి 9 గంటలకు పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు జైనూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయములో పరిస్థితి విషమించి మృతి చెందింది. పూజ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని డీఎస్పీ సత్యనారాయణ విచారణ చేపట్టారు. శనివారం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తహశీల్దార్ మృతదేహాన్ని పంచనామ చేశారు. ఇదిలా ఉండగా పూజ మృతితో మనస్తాపానికి గురైన భర్త మనోజ్ కుమార్ శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఉట్నూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు విచారణ పూర్తి చేసి పూజ తల్లిదండ్రుల కుటుంబానికి సరైన న్యాయం అందిస్తామని డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.
ఇదీ చూడండి:35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
TAGGED:
అసిఫాబాద్ జిల్లా వార్తలు