తూములు పూడుకుపోయాయి. కాల్వలకు గండ్లు పడ్డాయి. చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలు నిర్వహణ లోపాలను తేటతెల్లం చేస్తున్నాయి. ఆధునికీకరణ పనులకు ప్రతిపాదనలు పంపినా, నిధుల మంజూరు ఊసే లేక నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్టు పరిస్థితి. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టుకు జిల్లాలో 25 వేల ఎకరాల ఆయకట్టు, 60వేల ఎకరాల వరకు సాగునీరు అందిస్తుంది. ప్రాజెక్టు గేట్లు ఇప్పటికే తుప్పుపట్టగా... డ్యాం చుట్టూ జలాశయానికి చాలాచోట్ల గండ్లు పడ్డాయి.
భారీ గండ్లు
వట్టివాగు ప్రాజెక్టుకు గతంలో నామమాత్రంగా మరమ్మతులు చేయటంతో కాలువల లీకేజీలు, గండ్లుపడడం ఏటా రివాజుగా మారాయి. జలాశయానికి 4 కిలోమీటర్ల దూరంలో కాల్వకు గండి పడడం వల్ల అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. కుమురంభీం ఎడమ ప్రధాన కాలువ 74 కిలోమీటర్ల మేర పూర్తి కాగా... వాంకిడి సమీపంలో 4నెలల క్రితమే రెండు భారీ గండ్లు పడ్డాయి. అయినా నేటికి మరమ్మతులు చేయలేదు.
నీరు లేక ఎండిపోతున్న పంటలు
కాల్వలకు నీటి విడుదల నిలిపివేయటంతో రైతులు సాగు చేస్తున్న పంటలు ఎండిపోతున్నాయి. చాలా చోట్ల వాగుల నుంచి పైపులైన్ వేసి.. ఆయిలింజన్ ద్వారా నీటిని పంటలకు అందిస్తున్నారు. రోజుకు వేల రూపాయలు ఖర్చు చేస్తూ నీటిని తరలిస్తున్నారు. మూడేళ్ల క్రితమే కుడి కాల్వ 7 కిలోమీటర్ల మేర పూర్తి అయినప్పటికీ... సాగునీరు వదలటంలేదని రైతులు వాపోతున్నారు.
దిగుబడి తగ్గుతుంది
ఏడు ఎకరాల్లో పత్తి వేశాను. కాలువ పక్కనే చేను ఉండగా, నీటి తడులు అందించేవాడ్ని. కాలువకు గండ్ల కారణంగా నాలుగు నెలల నుంచి నీటిని అందించే వీలు కావడం లేదు. రూ.లక్షన్నర పెట్టుబడి పెట్టా. కేవలం అయిదు క్వింటాళ్ల పత్తి మాత్రమే వచ్చింది. నీటి లభ్యత ఉంటే మరో అయిదు క్వింటాళ్లు రావచ్చు. ఇప్పటికైనా కాలువలను చక్కదిద్ది నీరు అందించేలా అధికారులు చూడాలి. -సుధాకర్, చిన్న వాంకిడి
రోజుకు రూ.1000 ఖర్చు