కుమురం భీం జిల్లా బెజ్జూరు- పెంచికల్‌పేట్ ప్రధాన రహదారి, అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుండటంతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పెంచికల్‌పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన గుర్రాల సత్యనారాయణ, అల్లె బానేష్, ఉప్పరి చింటు, లోడ్‌పల్లికి చెందిన చింతల సాగర్‌లు శనివారం బెజ్జూరులో తాపి మేస్త్రి పని ముగించుకొని ఎల్కపల్లికి వెళ్తున్న క్రమంలో.. సులుగుపల్లి గొల్లదేవార సమీపంలో శనివారం రాత్రి 7.15గంటల సమయంలో పెద్దపులి ఎదురైంది.
సత్యనారాయణ ద్విచక్రవాహనం వెనుక కొద్దిదూరం పాటు పులి వెంబడించింది. దీంతో వారు ఆందోళన చెందారు. వాహన వేగం పెంచారు. అదే సమయంలో బారేగూడ గ్రామ పశువైద్య సేవకుడు పల్లెం రవికి సైతం పులి ఎదురైంది. వారంలో మూడు, నాలుగుసార్లు అదే ప్రాంతంలో పులి కనబడినట్లు బాటసారులు తెలిపారు. దీంతో బెజ్జూరు-పెంచికల్‌పేట్ రహదారి గుండా రాకపోకలు చేయడానికి ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆ మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై రేంజ్ అధికారి యాదగిరిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. పులి సంచరించే ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.