తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదివాసి బిడ్డకు అక్షర నీరాజనం.. - కుమురం భీం 80వ వర్ధంతి

దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటం మహోద్యమంగా సాగుతున్న సమయం. మరోపక్క తెలంగాణలో నిజాం నిరంకుశత్వం, రజాకార్ల ఆగడాలు పెచ్చుమీరి పేదల్ని పీక్కుతింటున్న రోజులవి... అప్పుడు వినిపించింది అరణ్యం నుంచో పిలుపు.. మెరుపును తెంపి.. ఉరుమును చీల్చుకొని.. భువిపైకి దూసుకొచ్చిన పిడుగులా అడవి బిడ్డలకు లభించిందో అండ.. అతడే జల్​, జంగిల్​, జమీన్​ నినాదంతో ఆదివాసీల హక్కులకై పోరాడి.. అమరుడైన కొమురం భీం. అక్టోబర్ 31న కొమురం భీం 80 వర్ధంతి సందర్భంగా ఈటీవీ భారత్, ఈటీవీ తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఆదివాసి బిడ్డకు అక్షర నీరాజనం..
ఆదివాసి బిడ్డకు అక్షర నీరాజనం..

By

Published : Oct 31, 2020, 7:49 AM IST

ఆదివాసీల హక్కుల సాధన కోసం నిజాం పాలనకు వ్యతిరేకంగా సమరభేరి మోగించిన యోధుడు..... జల్, జంగిల్, జమీన్,( నీరు, అడవి, భూమి) హక్కుల కోసం పోరాడి నిజాం పాలకుల గుండెల్లో అలజడి రేపిన ఉద్యమకారుడు కొమురం భీం. అడవి బిడ్డల ఆశయాల కోసం పోరాడి నేలమ్మ తల్లి ఒడిలో వాలాడు కొమురం భీం. ఏటా ఆశ్వయుజ పౌర్ణమి రోజున కొమురం భీం వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.

అడవి బిడ్డలే అనుచరులు

శిస్తు పేరుతో ఆదివాసీలపై నిజాం అనుచరులు చేస్తున్న ఆగడాలను సహించలేక 1940కి ముందే జోడేఘాట్ పోరాట గడ్డపై భీం తుపాకీ ఎక్కుపెట్టాడు. అడవి బిడ్డలనే అనుచరులుగా మార్చుకుని వారికి సాయుధ శిక్షణ ఇచ్చాడు. గిరిజనులు ప్రకృతి సంపదను అనుభవించకుండా అడవిలో కట్టెలు కొట్టకూడదని.. పశువులు మేప కూడదని... భూములు దున్న కూడదని నిజాం ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఆయన సవాలు చేశాడు.

చిన్నతనం నుంచే తిరుగుబాటు

భీం స్వగ్రామం ఆసిఫాబాద్ మండలం సంకేపల్లి గ్రామం. తండ్రి బాల్యంలోనే మరణించాడు. 15వ ఏటే జోడేఘాట్ ప్రాంతానికి తరలి వెళ్ళాడు. అనంతరం గ్రామ పెద్దగా బాధ్యతలు చేపట్టాడు. చిన్నతనంలో భీం సోదరులు అటవీ శాఖ సిబ్బందితో పడుతున్న గొడవలకు కారణాలను తెలుసుకున్నాడు. వారిని ఎదిరించడం ప్రారంభించాడు. ఇదే క్రమంలో అక్కడి సమకాలిక సమస్యలు, కారణాలపై అవగాహన పెంచుకున్నాడు. శతాబ్దాలుగా తాము అనుభవిస్తున్న అటవీ సంపదలపై నిజాం సర్కారు పన్నులు వసూలు చేయడం... ఈ నేపథ్యంతో చౌకీదార్ లు, పట్వారీలు గోండు గూడేలపై పడి దోచుకోవడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కొమరం భీంను కలిచివేశాయి. జమీందార్లు, చౌకీదార్​లపై నిజాం ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ వెళ్లాడు. కానీ నిజాం ప్రభువు అతడిని కలవకపోవడంతో తిరిగొచ్చి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని పోరుబాట పట్టాడు.

గెరిల్లా దళం ఏర్పాటు

ఆదివాసీ గిరిజన హక్కుల కోసం పోరాడేందుకు ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో యువకుడిని చేరదీసి సైన్యాన్ని ఏర్పాటు చేశాడు కొమురం భీం. వెదురు కొట్టడం, విల్లంబులు, బాణాలు తయారు చేయడంలో వారిని నేర్పరులను చేశాడు. నిజాం కాలంలో పట్టేదారులు గిరిజన మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడేవారు. ఈ క్రమంలో భూస్వామి సిద్ధిక్ భీమ్​తో గొడవకు దిగాడు. ఈ గొడవలో సిద్దిక్ తీవ్రంగా గాయపడటంతో... ఈ వార్త నిజాం ప్రభువు చెవిన పడింది. నిజాం అసాబ్ జాహి.. భీం​ను బంధించి తీసుకు రమ్మంటూ పోలీసులకు హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో భీం అజ్ఞాత జీవితంలోకి వెళ్లిపోయాడు. అక్కడ మొదలైన ఆయన ధిక్కార స్వరం నిజాం అధికారాన్ని శాసించే స్థాయికి చేరింది.

అనుచరుడి సమాచారంతో...

కొమురం భీం సారథ్యంలో అడవి బిడ్డలంతా ఏకమై కెరమెరి మండలంలోని జోడేఘాట్ కేంద్రంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. అక్కడికొచ్చే పోలీసులు, అటవీ అధికారులను బంధించే వారు. జోడేఘాట్ ప్రాంతంలోని 12 గ్రామ పంచాయతీల విముక్తి కోసం సాయుధ పోరాటం సాగించారు. కొమురం భీం సామర్ధ్యాన్ని గ్రహించిన నిజాం సర్కారు... దూతలతో రాజీ కోసం ప్రయత్నాలు చేసింది. అవి ఫలించకపోవడం వల్ల నిజాం ప్రభువు భీంను అంతమొందించేందుకు ప్రత్యేక దళాన్ని జోడేఘాట్​కు పంపాడు. ఆ ప్రయత్నం ఫలించకపోవడం వల్ల... మోసపూరితంగా భీంను అంతమొందించేందుకు అతని అనుచరులను ప్రలోభ పెట్టారు. వారి మాయలో పడిన భీం అనుచరుడైన మడావి కొద్దు... 1940 అక్టోబర్ 6న ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం అర్ధరాత్రి భీంను చుట్టుముట్టి గుండ్ల వర్షం కురిపించింది. నిజాం పోలీసులను వీరోచితంగా ఎదుర్కొని జన్మనిచ్చిన నేతతల్లి ఒడిలో ఒరిగిపోయాడు. నిజాం సైన్యం కాల్పుల్లో భీం మరణించడంతో ఆయన అనుచరులు చెల్లాచెదురయ్యారు.

2001 నుంచి కళతప్పిన దర్బార్

2001లో జోడేఘాట్​లో జరిగిన భీం వర్ధంతి దర్బార్లో అప్పటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సి.హెచ్.విద్యాసాగర్ రావు హాజరయ్యారు. దర్బారులో భాజపా కార్యకర్తలు పార్టీ పరమైన నినాదాలు చేశారు. అప్పటి కలెక్టర్ రామకృష్ణారావు దర్బార్​ను వాకౌట్ చేసి వెళ్లిపోయారు. దర్బారులో గిరిజన సంఘాల నాయకులు తమను ఉద్దేశపూర్వకంగా విమర్శించారని అధికారుల్లో అసహనం పురుడుపోసుకుంది. రాజకీయ పార్టీల జోక్యంతో అసలు దర్బారులే అవసరం లేదని అప్పటి ఐటీడీఏ పీవో సిసోడియా స్పష్టం చేశారు.

2002లో పేలిన మందుపాతర

2002లో భీం వర్ధంతి కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు భాభే ఝరిఘాట్​లో మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో డ్రైవర్ శంకర్ మృతిచెందగా, వ్యవసాయ అధికారులు షాహిద్, బాబురావు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి హట్టి బేస్ క్యాంపు లోనే కొమురం భీం వర్ధంతిని చేస్తూ వచ్చారు. దశాబ్దకాలం పాటు హట్టిలోనే భీం వర్ధంతి నిర్వహించగా... ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన సంఘాల నాయకులు మాత్రమే జోడేఘాట్​లో దర్బారును చేపడుతుండే వారు.

తెలంగాణలో అధికారికంగా...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 2014లో కొమురం భీం 74వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్​ జోడేఘాట్​ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రూ.25 కోట్ల వ్యయంతో మ్యూజియం ఏర్పాటుకు మంజూరు చేశారు. పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న జోడేఘాట్​లో ఇవాళ కొమురం భీం 80వ వర్ధంతి కార్యక్రమం జరగనుంది.

ఇదీ చూడండి:ఇంకా నెరవేరని కొమురం భీం జల్​-జంగల్​​-జమీన్ ఆశయం

ABOUT THE AUTHOR

...view details