ఆదివాసీల హక్కుల సాధనకు బెబ్బులిల గర్జించి నిజాం మూకలపై గెరిల్లా పోరాటం చేసిన మహా యోధుడు కొమురం భీం. 12 గ్రామాల గిరిజనులను ఒకటి చేసి జల్, జంగల్, జమీన్ నినాదమే శ్వాసగా బందూక్ చేతబట్టి తుడుం మోగించారు. అలుపెరుగని, మడమ తిప్పని భీం ఉద్యమ కెరటంలా ఎగిసిపడడం వల్ల జంకిన నిజాం, ఓ నమ్మకద్రోహి సహాయంతో ఆయన్ని దొంగ దెబ్బతో హతమార్చారు. అరాచకం, నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం స్వాతంత్య్రం రాకముందే భీం చేసిన ఈ యుద్ధం ఎన్నో సాయుధ పోరాటాలకు ఊపిరి పోసింది. కొమురం భీం అసువులు బాసి 80 ఏళ్లు అవుతున్నా ఆయన నినాదమైన భూమి, భుక్తి, నీరు గిరిజనులకు అందరికీ సంపూర్ణంగా చేరడం లేదు.
జల్(నీరు) సమస్య..
జోడేఘాట్, పాటగూడ, చాల్బాడీ, పిట్టగూడ, టోకెన్ మోవాడు, కళ్లెగామ్, లైన్ పటర్, చిన్న పాట్నాపూర్, పెద్ద పాట్నాపూర్ శివ గూడా, బాబె జరీ, కొడియన్ మోవాడ్ ఈ పన్నెండు పోరు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అప్పటినుంచి ఇప్పటివరకు నెలకొంది. వర్ధంతి సమయంలో అధికారులు తాగునీరు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం 150 మంది ఉండే పాట గూడ కు మిషన్ భగీరథ పైప్ లైన్ వేయలేదు. గ్రామస్థులు బోరు నీరే తాగుతున్నారు. ఇది మొరాయిస్తే చెలిమెల వద్దకు వెళుతున్నారు. మిగిలిన గ్రామాలకు నీరు వస్తున్నా రంగుమారి రావడం వల్ల నీటిని తాగడానికి గిరిజనులు ఇష్టపడడం లేదు.
జంగల్( అడవి) సమస్య..
కెరమెరి మండల కేంద్రం నుంచి జోడేఘాట్ 22 కిలోమీటర్ల పరిధిలో రెండు వరుసల రహదారి మంజూరు కాగా, ఇందులో ఎనిమిది కిలోమీటర్ల అటవీ అనుమతులు లేవనే కారణంతో నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ కంకర పరచి ఉంది. లైన్ పటార్, చాల్ బడి, కళ్లె గామ్, పిట్టగూడ గ్రామాలకు దారి సౌకర్యమే లేదు. రాళ్ల బాటలోనే ఆదివాసీలు రాకపోకలు సాగిస్తున్నారు.
జమీన్( భూమి) సమస్య..
సెప్టెంబర్ 25, 2019 హైకోర్టు ఆదేశానుసారం న్యాయ సేవ సంస్థ కార్యదర్శి ఆదిలాబాద్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ జిల్లా రెవెన్యూ అధికారులతో పోరు గ్రామాల్లో పర్యటించారు. అటవీ హక్కులు లేని ఆదివాసీలకు తప్పనిసరిగా అందించాలని అధికారులకు సూచించారు. 705 ఎకరాలు సాగు చేసుకుంటున్న రైతులకు అటవీ హక్కు పత్రాలు అందించాలని అప్పుడే అధికారులు ప్రతిపాదనలు పంపిన నేటికీ పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు అందలేదు. దస్త్రాలు లేకపోవడం వల్ల ఏటా పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేస్తున్నారు.