కరోనా నియంత్రణ కోసం మద్యం దుకాణాల మూసివేత.. నాటుసారా తయారీదారులకు వరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో గుడుంబా బట్టీలు వెలిశాయి. నిన్నమొన్నటిదాకా రూ.10 నుంచి రూ.20 వరకు విక్రయించిన సారా ప్యాకెట్ల ధరలు అమాంతం 100 రూపాయలకి పెంచేశారు.
మహారాష్ట్రకు పొరుగునే ఉన్న బెజ్జూరు, చింతల మానేపల్లి, కౌటాల, సిర్పూర్(టీ), పెంచికలపేట, దహెగాం, కాగజ్ నగర్ మండలాలతోపాటు ఆసిఫాబాద్ ఏజెన్సీలోని ఆసిఫాబాద్, లింగాపూర్, తిర్యాని, రెబ్బెన, కెరమెరి మండలాల్లో వందల సంఖ్యలో గుడుంబా బట్టీలు వెలిశాయి. ఆవాసాలకు దూరంగా పంటపొలాలు, అటవీ ప్రాంతాల మధ్యలో సారా తయారు చేసి ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి రాత్రి వేళల్లో సమీప మండల కేంద్రాలు, పట్టణాలకు తరలించి విక్రయాలు జరుపుతున్నారు.