అటవీశాఖలో కొందరు సొంత సిబ్బందే అక్రమాలకు పాల్పడుతున్నారు. కలప అక్రమ రవాణాదారులకు సహకరించడమే కాక.. పట్టుబడిన కలపను తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. కింది స్థాయిలో పనిచేసే కొందరు అటవీ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికే జిల్లా అటవీ ప్రాంతంలో విలువైన కలప తరిగిపోయింది. ఇటీవల కలప అక్రమ రవాణాపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం వల్ల అక్రమాలు కొంచెం తగ్గాయి. కానీ అక్కడక్కడా వెలుగుచూస్తూనే ఉన్నాయి. బెజ్జూర్ ఘటనతో ఇది తేటతెల్లమవుతోంది. ఒక్క రోజే ఆసిఫాబాద్ కాగజ్నగర్ డివిజన్ పరిధిలో నలుగురు అధికారులు సస్పెండ్ అవ్వడమే దీనికి నిదర్శనం.
కానలు కరిగిపోతున్నాయ్...
ఆసిఫాబాద్ కాగజ్నగర్ డివిజన్ పరిధిలో తిర్యాని, కాగజ్నగర్, బెజ్జూర్, పెంచికల్పేట, చింతల మానేపల్లి, పరిధిలో దట్టమైన అడవులన్నాయి. బెజ్జూరు పరిధిలో కృష్ణ పల్లి, అంబగట్ట, పెద్ద సిద్ధాపూర్లో విలువైన కలపకు నెలవులు. చింతలమానేపెళ్లి మండలం లోని గూడెం, కేతిని, అనుకోడా, ప్రాణహిత సరిహద్దు ప్రాంతంలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. స్థానికులు తమ అవసరాలకు టేకుచెట్లు నరికేస్తున్నారు. కిందిస్థాయి సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల నరికిన దుంగల్లో కొంత మొత్తం అధికారులకు ముట్టజెబుతున్నారు. దీనితో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.