తెలంగాణ

telangana

ETV Bharat / state

పక్షుల దాహం తీరుస్తున్న కొత్త ఆలోచన - ఆసిఫాబాద్​ వార్తలు

ఎండ వేడిమికి మనుషులు ఐదు నిమిషాలకోసారి నీళ్లు తాగుతూ.. దాహార్తి తీర్చుకుంటున్నారు. ఇంటిపట్టున ఉంటూ.. చల్లటి నీళ్లు తాగే మనమే తట్టుకోలేకపోతే.. ఇక పశుపక్ష్యాదుల సంగతేంటి? ఇదే సందేహం తేమాజీకి వచ్చింది. అంతే.. వినూత్న ఆలోచనతో.. పక్షుల దాహార్తితో పాటు.. ఆకలి కూడా తీరుస్తున్నాడు.

Temaji Creats Water Container For Thristy Birds
పక్షుల దాహం తీరుస్తున్న కొత్త ఆలోచన

By

Published : May 29, 2020, 3:45 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని చెక్​పోస్టు వద్ద తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తున్న తేమాజీ ప్రతిఏటా వేసవిలో పక్షుల ఆకలి, దూపలు తీరుస్తున్నాడు. ఈ ఏడాది కూడా పక్షుల ఆకలి దప్పికలు తీర్చడానికి తేమాజీ వినూత్న ఆలోచన చేశాడు. అదేంటంటే.. ఖాళీ నూనె డబ్బాను నాలుగు వైపులా రేకులు కోసి.. మధ్యలో నీళ్లు ఉంచే తొట్టిలా చేశాడు. కోసిన రేకులను నాలుగు వైపులా సగం వరకు వంచి.. అందులో గింజలు ఏర్పాటు చేశాడు. నీళ్ల కోసం వచ్చిన పక్షులు నాలుగు గింజలు తినేలా.. గింజల కోసం వచ్చిన పక్షులు గుక్కెడు నీళ్లు తాగేలా తేమాజీ చేసిన ఆలోచన అందరికీ నచ్చింది. సోషల్​ మీడియాలో కూడా తేమాజీ చేసిన ఈ ప్రయోగం ఎక్కువమంది షేర్​ చేస్తూ.. అలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ప్రతీ ఏటా తన వంతుగా పక్షుల దాహార్తి తీర్చే తేమాజీ ఈ సారి వినూత్న ప్రయత్నం చేసి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎండలు తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మూగజీవాలకు ఈ విధంగా సాయం చేయడం మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తుందంటున్నాడు తేమాజీ. తనకు వచ్చే జీతంలోనే పక్షుల కోసం ఎంతో కొంత ఖర్చు చేస్తానంటున్నాడు.

ఇదీ చదవండి:కరోనా వ్యాక్సిన్​ కోసం మళ్లీ ప్లాస్మా దానం

ABOUT THE AUTHOR

...view details