అసలేం జరుగుతోంది..? రాత్రిపూట స్టేషన్‌కు పోలీస్ బాస్ ఈ నెల 2న ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆసిఫాబాద్‌కు వచ్చిన డీజీపీ మహేందర్ రెడ్డి... మొదటి రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేసి ఆసిఫాబాద్‌లో బస చేశారు.
రెండు రోజుల పాటు ఆసిఫాబాద్ లోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలోనే ఒకరిద్దరు పోలీస్ ఉన్నతాధికారులతో అంతర్గత సమీక్షలకే పరిమితమయ్యారు. కాగా... శుక్రవారం రాత్రి రామగుండం సీపీ సత్యనారాయణతో కలిసి మారుమూలన ఉన్న తిర్యాణి పోలీస్ స్టేషన్‌ను సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దాదాపు 45 రోజుల కిందట తిర్యాణి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారస పడ్డారు. ఇది కాల్పులకు దారితీసింది. కానీ మావోయిస్టు కీలక నేత మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని నక్సల్స్ తప్పించుకోవడం పోలీసులను నివ్వెర పర్చింది. ఈ ఘటన జరిగిన రెండు రోజులకు అంటే జులై 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు ఆసిఫాబాద్‌లోనే ఉన్న డీజీపీ... పోలీసులను వెన్నుతట్టే ప్రయత్నం చేశారు.
తాజాగా మూడు రోజులుగా ఆసిఫాబాద్ లోనే మఖాం వేసిన డీజీపీ... ఇంతటి మారుమూల అటవీ ప్రాంతానికి రావడం ఇదే ప్రథమం. తిర్యాణి పోలీసు స్టేషన్‌కు డీజీపీ వెళ్లి, వచ్చే వరకు బయటకు పొక్కకుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. డీజీపీ సహా పోలీసు అధికారులు ఎవరూ... మీడియాతో మాట్లాడలేదు. నక్సల్స్ కదలికలపై పోలీసు, ఎస్ఐబీ అధికారులకు... దిశానిర్దేశం చేసిన డీజీపీ తదుపరి పర్యటనపై సమాచారం ఇవ్వకపోవడం వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది.
ఇదీ చూడండి:'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'