SS Rajamouli Visited Galibudaga Theater: దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలంతా కలిసి సినిమా థియేటర్ను కట్టడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని దర్శకుధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. ఇవాళ ఆయన కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సందడి చేశారు. జిల్లా మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న గాలిబుడుగ థియేటర్ను సతీసమేతంగా సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. రాజమౌళి రాకను పురస్కరించుకొని థియేటర్ వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.
కలెక్టర్ రాహుల్ రాజ్... రాజమౌళి దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన కుమురం భీమ్ చిత్ర పటానికి నివాళులర్పించారు. కుమురం భీమ్ వారసులను పేరుపేరున పలకరించిన రాజమౌళి... గాలిబుడగ థియేటర్లో జిల్లా అధికారులు, కుమురం భీమ్ వారసుల సమక్షంలో కొద్దిసేపు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలంతా కలిసి థియేటర్ కట్టడం ఆనందంగా ఉందన్న రాజమౌళి... జిల్లా మహిళా సమాఖ్యలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడి అటవీ ప్రాంతంలోని అందమైన ప్రదేశాలను చూడటానికి మరోసారి ఆసిఫాబాద్ వస్తానని రాజమౌళి పేర్కొన్నారు.
కుమురంభీమ్ మీద సినిమా తీయడం.. ఇప్పుడా జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కట్టిన సినిమా థియేటర్లో పెద్దమొత్తంలో మహిళలదే పాత్ర ఉన్నట్లు తెలిసింది. మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. నాకు తెలిసి ఇండియాలో మహిళలంతా కలిసి సంఘటిత శక్తిగా ఏర్పడి ఒక థియేటర్ కట్టడం అనేది ఎక్కడా జరగలేదు. ఇండియా మొదటిసారి ఇక్కడ జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. కచ్చితంగా మళ్లీ ఇక్కడకు వస్తాను. జిల్లాలో చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని తెలిసింది..మళ్లీ వచ్చినప్పుడు మొత్తం కలియ తిరుగుతాను.