కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో గుట్టపై ఉన్న గిరి పల్లె మార్లవాయి కనకరాజు జన్మస్థలం. పేద రైతు దంపతుల రాము, రాజుభాయిల ఏకైక కుమారుడు ఆయన. 80 ఏళ్ల వయసున్న రాజుకు ఆ రోజుల్లో విద్యావకాశాలు లేవు. ఓ మాస్టారు దగ్గర మరాఠీ అక్షరాలు మాత్రమే నేర్చుకున్నారు. తండ్రితో వ్యవసాయ పనులకు వెళ్లేవారు. రాజుకు ఇద్దరు భార్యలు.. పెద్ద భార్య పార్వతీబాయి ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు... చిన్న భార్య భీమ్ భాయికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. అందరికీ వివాహాలు అయ్యాయి. కుమారులంతా వ్యవసాయం చేస్తున్నారు. గుస్సాడీ నృత్యమే ఆలంబనగా కనకరాజు పెరిగారు. తనకు భారత ప్రభుత్వం ఇంత గొప్ప పురస్కారం ఇస్తుందని ఆయన కలలో కూడా ఊహించలేదు. పద్మశ్రీ అవార్డు ఒకటుందని కూడా తెలియదు అంటున్నారాయన.
ఆదివాసీ గూడెం నుంచి దిల్లీ వరకు...
1982 దేశ రాజధాని దిల్లీ ఎర్రకోట గణతంత్ర వేడుకలకు ఉమ్మడి రాష్ట్రం నుంచి గిరిజన సంప్రదాయ నృత్య ప్రదర్శనకు అవకాశం వచ్చింది. అప్పటి ఆదివాసీ తొలి ఐఏఎస్ అధికారి సిడాం తుకారాం మార్లవాయిలోని కనకరాజు నృత్య ప్రతిభను చూసి వారి బృందాన్ని ఎర్రకోట వేడుకల్లో పాల్గొనే అవకాశం కోసం ప్రతిపాదనలు పంపించారు. ఇందుకు జైనూరు మండలం పిట్టగోడలో ఏర్పాటుచేసిన రెండు మాసాల శిబిరంలో కనకరాజు నేతృత్వంలో 100 మంది యువకులకు శిక్షణ ఇచ్చారు. వీరిలో ప్రతిభ చూపిన 35 మందిని దిల్లీకి తీసుకెళ్లారు.
సంక్రాంతి రోజున దిల్లీకి చేరుకున్న ఈ బృందం ఎర్రకోట వద్ద 12 రోజులు, ఇండియా గేట్ వద్ద రెండు రోజులు, బాపూజీ ఘాట్ వద్ద ఒక రోజు ప్రదర్శనలిచ్చారు. గణతంత్ర వేడుకల సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వీరి వద్దకు వచ్చి ప్రశంసించారు. ఆ సమయములో కనకరాజు ఇందిరా గాంధీకి స్వయంగా గుస్సాడి నెమలి పింఛాల టోపీని ధరింపజేశారు. గజ్జలు ఇచ్చి ఆమెను కట్టుకోవాలని కోరారు. ఆ తర్వాత ఆమె ఏడు నిమిషాల పాటు తమతో కలిసి నృత్యం చేశారని రాజు తన జ్ఞాపకాలను పంచుకున్నారు.