కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం పంగిడిలో విషాదం జరిగింది. జైనూరు మండలం పోచంలోది ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శివదాస్... తన తండ్రి చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. శివదాస్కు మూర్ఛవ్యాధితో పాటు మానసిక వైకల్యం ఉంది. కొన్ని రోజులుగా... ఎక్కువసార్లు మూర్ఛ రావటం వల్ల 2 నెలల క్రితం శివదాస్ను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి నుంచే పాఠశాలకు వెళ్లేవాడు.
తండ్రి కళ్ళ ముందే జలపాతంలో దూకేశాడు - 10th CLASS STUDENT SUICIDE
ఎదిగిన కొడుకు కళ్ల ముందే కనుమరుగయ్యాడు. దూకేస్తున్నాను నాన్నా... అనే చివరి మాటతో నిర్ఘాంతపోవటమే ఆ తండ్రి వంతైంది. ఈ విషాదకర ఘటన కుమురం భీం జిల్లా... పంగిడిలో జరిగింది.
ఈ క్రమంలో గురువారం రోజు తండ్రితో కలిసి పొలం పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం పూజ భోజనం చేయడానికి తండ్రి ఇంటికి వెళ్లగా... శివదాసు చేనులోనే ఉండిపోయాడు. సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో తండ్రికి ఫోన్ చేసి... కుండాయి జలపాతం వద్దకు వెళ్తున్నానని సమాచారమిచ్చాడు. ఐదుగురు గ్రామస్థులతో కలిసి తండ్రి హుటాహుటిన జలపాతం దగ్గరికి వెళ్లాడు. జలపాతం అంచున నిల్చున్న శివదాస్.. తండ్రి రాకను గమనించాడు. దూకేస్తున్నాను నాన్నా.. అనే చివరి మాటతో జలపాతంలో దూకేశాడు. తన కళ్లెదురుగానే... ఎదిగిన కొడుకు దూకుతున్నా... అచేతనంగా నిలబడిపోవటం ఆ తండ్రి వంతైంది. షాక్ నుంచి తేరుకున్న ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు.
గ్రామస్థుల సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో వెతికించగా... మృతదేహం లభ్యమైంది. విగతజీవిగా మారిన శివదాస్ను చూసి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.