hostels problems in Kumurabhim District : రాష్ట్రంలో పేదపిల్లలకు ఉచిత ఆంగ్లమాధ్యమ విద్యకోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన సంక్షేమ గురుకులాలు, వసతిగృహాలు, కస్తూర్బా విద్యాలయాల్లో సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపమవుతోంది. నిరంతర ఆరోగ్య పరీక్షలు, సకాలంలో వైద్యచికిత్సలు అందకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమి వెరసి విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. జ్వరలక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకోవాల్సిన సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారమిచ్చి తప్పుకొంటున్నారు. ఫలితంగా కీలకమైన సమయంలో వైద్యం లభించక విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు. ఒక్క కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే 12 రోజుల వ్యవధిలో నలుగురు విద్యార్థులు జ్వరంతో కన్నుమూశారు.
బుధవారం మరో విద్యార్థిని తలనొప్పితో బాధపడుతూ నిద్రలోనే ప్రాణాలు వదిలింది. దాదాపు ఎనిమిది లక్షల మంది విద్యార్థులు చదువుతున్న, ఆశ్రయం పొందుతున్న గురుకులాలు, వసతిగృహాల బాధ్యతను పూర్తిగా వసతి గృహ సంక్షేమాధికారులు, గురుకుల సిబ్బందిపై వదిలేయడం గమనార్హం. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించింది. కరోనా తరువాత వాటి నిర్వహణ గాడితప్పింది. అపరిశుభ్ర వాతావరణం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడంతో జ్వరాలు, వ్యాధులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వమిచ్చే మెస్‌ఛార్జీలతో కనీస ప్రమాణాల మేరకు పౌష్టికాహార భోజనం పెట్టే పరిస్థితి లేక రోగనిరోధక శక్తి కోల్పోతున్నారు.
రక్తహీనత తలెత్తుతోంది. ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసైటీకి ఒకే కార్యదర్శి ఉండటం, ఆయనపై ఇతర శాఖల బాధ్యతలు కూడా మోపడంతో క్షేత్రస్థాయి పర్యటనలకు సమయం సరిపోవడం లేదు. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న అధికారులు పరిపాలన పనులకే పరిమితమవుతున్నారు. క్షేత్రస్థాయిలో గురుకులాల నిర్వహణకు విశ్రాంత అధికారుల్ని ప్రాంతీయ సమన్వయ అధికారులుగా నియమించినా పూర్తిగా దృష్టిపెట్టడం లేదు. గురుకులాల్లో ఇటీవల కొందరు పీజీటీలకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి కల్పించి పర్యవేక్షణ నుంచి ఉన్నతాధికారులు తప్పుకోవడంతో పరిస్థితి మొదటికి వచ్చింది.
విద్యార్థుల ఆరోగ్య రికార్డుల్లేవు:గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు వైద్యపరీక్షలతో ఆరోగ్యకార్డులు సిద్ధం చేసేవారు. రక్తగ్రూపు, హిమోగ్లోబిన్, కంటిచూపు తదితర పరీక్షలు ఉండేవి. విద్యార్థులకు సమస్యలుంటే తొలి నుంచి వారికి చికిత్స అందిస్తూ, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేవారు. ఈ మేరకు సొసైటీలు సొంతంగా ఖర్చుపెట్టేవి. ప్రస్తుతం ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యార్థులకు 24 గంటల పాటు వైద్యచికిత్స, సలహాలకు నెలకొల్పిన పనేషియా కమాండ్ కంట్రోల్ వైద్యసేవలు సాంకేతిక కారణాలతో పూర్తిస్థాయిలో అందడం లేదు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థుల ఆరోగ్యానికి బ్యాంకులు సీఎస్‌ఆర్ కింద నిధులిచ్చినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బీసీ గురుకుల సొసైటీని తప్పించారు. ఇక ఎస్సీ గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించగా.. ఆరునెలల కాలంలో తొమ్మిది మంది డెంగీ, 3200 మంది వైరల్ జ్వరాల బారిన పడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోని పాఠశాలలు, వసతిగృహాల్లో జ్వరకేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఆసుపత్రులకు పరుగులు:కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆగస్టు నెలలో 750 మంది విద్యార్థులు అనారోగ్యంతో స్థానిక సీహెచ్‌సీలో చికిత్స పొందారు. నిత్యం 50 నుంచి 75 మంది విద్యార్థులు వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేకరించిన నమూనాలను తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపించడం.. రెండు మూడు రోజుల తర్వాత ఫలితాలు వస్తుండటంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
నిలిచిన ఏఎన్‌ఎంల సేవలు:గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలను ఆగస్టులోనే ప్రభుత్వం తొలగించింది. వీరు అక్కడే ఉండి విద్యార్థులు అనారోగ్యానికి గురైతే రాత్రీ.. పగలు తేడా లేకుండా వైద్యసేవలు అందించేవారు. ప్రస్తుతం చిన్నపాటి జ్వరమని ఉపాధ్యాయులు ఊరుకోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది. అప్పుడు ఆసుపత్రికి తరలించడం వల్ల వీరి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది.
పరిశుభ్రత, పౌష్టికాహారం ముఖ్యం:వసతిగృహాల్లో నిరంతర పరిశుభ్రత పాటించాలి. చుట్టూ ప్రదేశాల శానిటేషన్‌తో పాటు ఉదయం, సాయంత్రం దోమల నివారణ చర్యలు చేపట్టాలి. వసతిగృహాల్లో పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలందరికీ నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించి, మానసిక, శారీరక ఆరోగ్యం కాపాడాలి. వసతి గృహంలో ఒకేసారి నలుగురు విద్యార్థులకు జ్వరాలు వస్తే తీవ్రంగా పరిగణించాల్సిందే. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. జ్వరాలు వచ్చిన విద్యార్థులకు చికిత్స అందించడంతో పాటు మిగతా విద్యార్థుల్లో రోగనిరోధక శక్తి పెంచాలి. అందరూ కలిసి ఒకేచోట ఉండే వసతి గృహాల్లోని విద్యార్థులకు జలుబు, జ్వరాలు రాకుండా ముందస్తు రక్షణగా పౌష్టికాహారం, హోమియో మందులు అందించవచ్చు. వీటితో పిల్లలు తీవ్ర ప్రమాదంలోకి వెళ్లకుండా జాగ్రత్తపడవచ్చు.
- డాక్టర్ అపర్ణ కొడాలి, హోమియో వైద్యురాలు..
అందరికీ రక్త పరీక్షలు చేస్తాం:గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో కుమురం భీం జిల్లాలో ఉన్న విద్యార్థులందరి రక్త నమూనాలను సేకరించి, అందుకు అనుగుణంగా చికిత్సలు చేస్తాం.
- ప్రభాకర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ, కుమురం భీం