కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన రాజయ్య, రాజ్యలక్ష్మి దంపతులకు ఏడుగురు సంతానం. కుమారుడు చిన్నవయసులోనే మృతి చెందాడు. కుటుంబ పెద్ద రాజయ్య గతేడాది అనారోగ్యంతో మరణించగా... తల్లి రాజ్యలక్ష్మి కూలినాలి చేసుకుంటూ ఆరుగురు ఆడ పిల్లలను సాకింది. పెద్దవారైన ఐశ్వర్య, మానస చదువు మధ్యలోనే ఆపేసి తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. హారిక ఎనిమిదో తరగతి, మౌనిక 6, హరిణి 2వ తరగతి చదువుతున్నారు. చిన్న కూతురు స్వేచ్ఛశ్రీ ఇంటివద్దే ఉంటుంది.
కన్నెర్ర చేసిన కాలం...
ఇంటికి పెద్దదిక్కును కోల్పోయి కడుపేదరికంతో ఉన్న ఆ కుటుంబంపై కనికరమే లేకుండా కాలం కన్నెర్ర చేసింది. తల్లి రాజ్యలక్ష్మి సైతం గత వారం అనారోగ్యంతో మృతి చెంది ఆరుగురు పిల్లల్ని అనాథలను చేసింది. తల్లితండ్రులిద్దరు మృతి చెందటం వల్ల ఆరుగురు బాలికలు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఆరుగురు అమ్మాయిలు... అండగా నిలుస్తున్న దాతలు.. సామాజిక మాధ్యమాల ద్వారా...
వారి పరిస్థితిని తెలుసుకున్న స్థానిక యువకుడు సామాజిక కార్యకర్త ఎలగందుల తిరుపతి తనకు తోచిన విధంగా ఆదుకోవాలని సంకల్పించాడు. సామాజిక మాధ్యమం ద్వారా దాతలకు పరిస్థితి వివరించి సాయం కోరారు. బాలికల గురించి సామాజిక మాధ్యమం ద్వారా తెలుసుకుని స్పందించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్... అసిఫాబాద్ మాత శిశు సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడి తక్షణం ఆశ్రయం కల్పించాలని ఆదేశించారు. ఉన్నత చదువులతో పాటు అన్ని విధాలా అండగా నిలబడతానని భరోసానిచ్చారు.
ఆరుగురు అమ్మాయిలు... అండగా నిలుస్తున్న దాతలు.. బాధ్యత తీసుకున్న ప్రభుత్వం...
మంత్రి కేటీఆర్ సైతం బాలికల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సొంత ఖర్చులతో ఇల్లు నిర్మించి ఇస్తానని చెప్పి కుమారుడు వంశీతో భూమి పూజ చేయించారు. తెలంగాణ గురుకులాల సెక్రెటరీ డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పెద్ద కుమార్తె ఐశ్వర్యకు ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు జిల్లా పాలనధికారి సందీప్ కుమార్ ఝా ప్రత్యేక శ్రద్ధ వహించి బాలికలను ఆశ్రమానికి తరలించించేవరకు ఎలాంటి లోటుపాటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, ఉద్యోగులు సైతం ఆర్థికంగా సాయం చేస్తున్నారు.
ఆరుగురు అమ్మాయిలు... అండగా నిలుస్తున్న దాతలు.. తమ కష్టాన్ని చూసి చలించి అండగా నిలిచిన ప్రభుత్వానికి, అధికారులకు, మానవతావాదులకు ఆ అమ్మాయిలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకుంటామంటున్నారు.