తెలంగాణ

telangana

ETV Bharat / state

భయం భయం: ఆచూకీ ఎక్కడ.. పులి ఏమైనట్టు.. ఎటెళ్లినట్టు! - పులి కోసం గాలిస్తున్న అటవీ అధికారులు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులివేట కొనసాగుతోంది. నాల్గు రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ముమ్మరంగా గాలిస్తున్నారు. బోన్లను అందుబాటులో ఉంచి... ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమీప గ్రామాల్లో పులి సంచారంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

searching-for-tiger-at-dehgam-in-komaram-bheem-asifabad-district
భయం భయం: ఆచూకీ ఎక్కడ.. పులి ఏమైనట్టు.. ఎటెళ్లినట్టు!

By

Published : Nov 15, 2020, 5:06 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నాల్గో రోజు పులి వేట కొనసాగుతోంది. ప్రధానంగా దహేగం, బెజ్జురు, పెంచికలపేట మండలంలోని అటవీ ప్రాంతంలో 50 మంది సిబ్బందితో నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయినా పులి ఆచూకీ లభించలేదు.

గాలింపు ముమ్మరం

దహేగం మండలం దిగిడ గ్రామంలో మనిషిపై దాడి చేసి హతమార్చిన పులిని బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దిగిడ ఆటవీప్రాంతంలో రెండు బోన్లు ఏర్పాటు చేసి... మరిన్ని బోన్లను అందుబాటులో ఉంచారు. ఆ పులి ఇప్పటికే ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఉంటుందని భావిస్తున్న అధికార యంత్రాంగం... కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్న పులుల వల్ల ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆవాసం లేకనే...

ప్రాణహిత పరివాహక ప్రాంతం మీదుగా కాగజ్ నగర్ అటవీ డివిజన్‌కి మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యం నుంచి పులుల రాకపోకలు సాగించడం కొంతకాలంగా కొనసాగుతోంది. మరోవైపు ఆసిఫాబాద్ అడవులు పులులకు ఆవాసయోగ్యంగా లేకపోవడం వలన తిరిగి మహారాష్ట్ర వైపు వెళ్లి ఉండవచ్చని అధికార యంత్రాంగం సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చింది.

నిరంతర పర్యవేక్షణ

ఆసిఫాబాద్ డిఎఫ్ఓ వినయ్ కుమార్ సాహు, రెబ్బెన రేంజి ఆఫీసర్ పూర్ణిమ నేతృత్వంలో 50 మందితో కూడిన సిబ్బంది దహేగం అటవీప్రాంతంలో నిరంతరంగా గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు. పులి దాడి జరిగిన నేపథ్యంలో పులిని ఎట్టి పరిస్థితుల్లో బంధిస్తామని అధికారులు పేర్కొన్నారు.

అవగాహన కార్యక్రమాలు

కాగజ్ నగర్ డివిజన్ అటవీ ప్రాంతంలో కొత్తగా వచ్చిన పులి కాకుండా చాలా పులులు ఉన్నందున సమీప గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పులి సంచారం పట్ల అప్రమతంగా ఉండాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:అప్రమత్తమైన అటవీశాఖ.. పులిబోన్లు ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details