ఈ బడిలో చదవాలంటే గొడుగు ఉండాల్సిందే కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలం గువ్వలం గూడెం ప్రభుత్వ పాథమిక పాఠశాలలో విద్యార్థులకు గొడుగు ఉంటేనే విద్యనభ్యసించే పరిస్థితి వచ్చింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 33 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఏ వైపు చూసినా తరగతి గదుల్లో పైనుంచి వర్షం కురుస్తుండటం వల్ల పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూత్ర శాలలు కూడా సరిగా లేవని విద్యార్థులు తెలిపారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న ఈ పాఠశాలలో విద్యార్థులు కింద కూర్చోలేని పరిస్థితి. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినాలంటే గొడుగు పట్టుకొవాల్సిందే. అన్నం తినడానికి కూడా గొడుగు ఉండాలని విద్యార్థులు తెలిపారు. రెండేళ్లుగా ఈ పరిస్థితితో చదువుకోలేక పోతున్నామని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవనం నిర్మించి సుమారు 20 ఏళ్లు కావోస్తుందని.. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.