తెలంగాణ

telangana

ETV Bharat / state

‘ఆసరా’ దూరం... గడువు తీరి నిలిచిన వికలాంగుల పింఛన్లు - asifabad district latest news

అన్ని అర్హతలున్నా.. కొందరు దివ్యాంగులకు పింఛన్లు నిలిచిపోవడంతో ఆవేదనకు గురవుతున్నారు. పునరుద్ధరణ కోసం మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసేందుకు వెళ్లినా అవకాశం లేనట్లు చూపడంతో ఆందోళన చెందుతున్నారు. సదరం గడువు తీరి పునరుద్ధరణ కాక కొందరు, కొత్తగా శిబిరంలో వైద్య పరీక్షలు జరిగినా ధ్రువపత్రం అందక మరి కొంతమంది ప్రభుత్వం అందించే ఆసరాకు దూరమవుతున్నారు.

sadaram
sadaram

By

Published : Jul 21, 2020, 12:26 PM IST

ఆసిఫాబాద్‌ జిల్లాలో వివిధ విభాగాలకు సంబంధించి 1,539 మంది దివ్యాంగుల సదరం ధ్రువపత్రాల గడువు తీరింది. దీంతో వీరంతా పింఛనుకు దూరమయ్యారు. ధ్రువపత్రాల పునరుద్ధరణతో పాటు కొత్త వారి కోసం సదరం శిబిరాలు నిర్వహిస్తున్నారు.

కానీ సకాలంలో ధ్రువపత్రాలు అందకపోవడం, దరఖాస్తులు చేసుకున్నా ప్రభుత్వం త్వరగా పింఛను మంజూరు చేయకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. జిల్లాలో జనవరి నుంచి మార్చి వరకు నిర్వహించిన సదరం శిబిరాల్లో 203 మంది కొత్త వారితో పాటు పాత వారు ధ్రువపత్రాల పునరుద్ధరణ కోసం హాజరయ్యారు. ఇందులో 81 మందిని వైద్యులు అర్హులుగా గుర్తించారు. వీరికి సదరం ధ్రువ పత్రాలను వైద్య అధికారులు పంపిణీ చేశారు.

కరోనాతో నిలిచిపోయాయి

కొవిడ్‌-19 కారణంతో ఏప్రిల్‌, మే నెలల్లో సదరం శిబిరాలు నిలిచిపోయాయి. మళ్లీ జూన్‌ 14 నుంచి మొదలయ్యాయి. ఇప్పటి వరకు ఆర్థో, ఈఎన్‌టీ, కంటికి సంబంధించి పది సదరం శిబిరాలు నిర్వహించారు. వీటిలోనూ కొత్త వారితో పాటు పాత వారు ధ్రువ పత్రాల పునరుద్ధరణ కోసం 458 మంది మీ సేవలో స్లాట్‌ బుక్‌ చేసుకొని సదరం శిబిరాలకు హాజరయ్యారు.

వీరిలో 149 మంది అర్హులుగా వైద్యులు నిర్ధరించారు. కానీ వీరికి ఇప్పటికి ధ్రువ పత్రాలను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు ఇవ్వలేదు. దీంతో వీరంతా పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ప్రస్తుతం వికలాంగ పింఛను పొందుతున్న వారు 6,547 మంది ఉన్నారు.

ప్రతి శిబిరానికి 65 స్లాట్‌లు..

ప్రతి మూడు నాలుగు రోజులకోసారి సదరం శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సదరం శిబిరంలో కొత్త వారికి 25, పునరుద్ధరణ కోసం 40 వంతున స్లాట్‌లు కేటాయిస్తున్నారు. దివ్యాంగులు మీ సేవ కేంద్రంలో స్లాట్‌ బుక్‌ చేసుకొని సూచించిన తేదీలో సదరం శిబిరానికి హాజరు కావాలి.

సెప్టెంబరు 29 వరకు 21 సదరం శిబిరాలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో కొత్త వారు ఇప్పటి వరకు 474 మంది స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. ఇంకా 203 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. పునరుద్ధరణ కోసం 634 మంది బుక్‌ చేసుకోగా ఇంకా 431 ఖాళీగా ఉన్నాయి.

తగరం జీవన్‌

ఈ చిత్రంలో కనిపిస్తున్నది తగరం జీవన్‌. బెజ్జూర్‌ మండలం మొగవెళ్లి. వంకర్లు తిరిగిన కాళ్లతో ఒకరి సహాయం లేనిదే నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. 2017 జూన్‌లో వికలాంగ సదరం ధ్రువ పత్రం తీసుకున్నారు. రెండేళ్ల కాలపరిమితితో సదరం పత్రం జారీ చేశారు. గతేడాది జూన్‌లో గడువు ముగిసి పింఛను నిలిచింది.

ఇప్పటికి సుమారు 39 వేలకు పైగా ప్రభుత్వ సాయాన్ని నష్టపోయారు. మార్చి 3న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరానికి వచ్చారు. కానీ ధ్రువపత్రం రాలేదు. మళ్లీ సదరం కోసం మీ సేవ కేంద్రంలో స్లాట్‌బుక్‌ చేసేందుకు వెళితే 2022 వరకు నమోదుకు అవకాశం లేనట్లు చూపుతోందని.. ఇటీవల ప్రజా ఫిర్యాదుల విభాగంలో దరఖాస్తు చేసేందుకు వచ్చిన వికలాంగుని తండ్రి ఇస్తారి వాపోయారు.

స్లాట్‌ బుక్‌ చేసుకొని రావాలి

జిల్లాలో సెప్టెంబరు వరకు సదరం శిబిరాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. కొత్త వారితో పాటు గడువు తీరిన సదరం ధ్రువపత్రం కలిగిన దివ్యాంగులు మీ సేవ కేంద్రంలో స్లాట్‌ బుక్‌ చేసుకొని రావాలి. వైద్య పరీక్షల అనంతరం అర్హులైన వారికి సదరం ధ్రువ పత్రాలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారుల ద్వారా పంపిణీ చేస్తాం. అర్హులందరికి పింఛన్‌ మంజూరు అయ్యేలా చూస్తాం.

- వెంకట శైలేష్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

అగ్గిల రమేశ్‌

ఈ చిత్రంలో కనిపిస్తున్నది మండలంలోని సింగరావుపేటకు చెందిన దివ్యాంగుడు అగ్గిల రమేశ్‌. ఈయనను చూస్తే శాశ్వత వికలాంగుడని ఎవరైనా చెపుతారు. కానీ ఈయనకు గతంలో అయిదేళ్ల కాలపరిమితితో కూడిన సదరం ధ్రువ పత్రాన్ని ఇచ్చారు. గతేడాది నవంబరులో గడువు తీరింది. దీంతో అప్పటి నుంచి పింఛను నిలిచిపోయింది. అంటే ఇప్పటికి రూ.24 వేలకు పైగా నష్టపోయారు. కొత్తది ఎప్పుడు మంజూరు అవుతుందో తెలియదు. మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తల్లి కూలీ చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. పింఛన్‌ పునరుద్ధరించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details