తెలంగాణ

telangana

ETV Bharat / state

బడి బియ్యం.. పురుగులపాలు! - ప్రభుత్వ పాఠశాలల్లో బియ్యం నిల్వలు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థుల కడుపు నింపే బియ్యం పురుగుల పరమవుతోంది. శిథిలమైన భవనాలలో నిల్వ ఉంచిన కారణంగా వర్షం వల్ల వచ్చే తేమతో బియ్యం ముక్కిపోతున్నాయి. ఆకలి తీర్చే అన్నపూర్ణ ఇలా అక్కరకు రాకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో, మారుమూల గ్రామాల్లో ప్రస్తుతం ఉపాధ్యాయులు విధులకు హాజరవుతున్నారు. పాఠశాలలు తెరచి ఉంచడంతో మధ్యాహ్నం భోజనం పెడతారనే ఆశతో విద్యార్థులు వస్తున్నా.. ప్రస్తుతం అంతర్జాలంలో బోధన మాత్రమే చేస్తున్నామని ఉపాధ్యాయులు వారికి సర్దిజెపుతున్నారు.

Rising rice stocks in government schools in Kumaram Bhim district
బడి బియ్యం.. పురుగులపాలు!

By

Published : Sep 25, 2020, 1:26 PM IST

ఇది బెజ్జూర్‌ మండలంలోని కుశ్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిల్వ ఉన్న నాలుగు క్వింటాళ్ల బియ్యం. గదిలో సంచులు తేమకు గురై చెడిపోతు న్నాయి. బియ్యం ముక్క వాసన వస్తూ గడ్డకడుతున్నాయి.

చింతలమానెపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బియ్యం నిల్వలు ఎలుకలు, పురుగులకు ఆహారంగా మారుతున్నాయి. పురుగుపట్టి బియ్యం ముద్దలుగా మారుతున్నాయి.

జిల్లాలో ఉన్న ఆదర్శ పాఠశాలలు, కసూర్బా విద్యాలయాలు, ప్రాథమిక, జడ్పీ, ఉన్నత పాఠశాలల్లోని బియ్యం నిల్వలు పాడవుతున్నాయి. మార్చిలోనే బడులు మూతపడగా.. బియ్యం సంచులు ఆరేడు నెలల నుంచి వంట గదుల్లో ఉంటున్నాయి. కొన్నిచోట్ల సంరక్షణ చర్యలు చేపడుతున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గిరిజన ఆశ్రమ వసతిగృహాల్లో ఉన్న నిల్వలతో పాటు, ఇతర సామగ్రిని లాక్‌డౌన్‌ సమయంలోనే పాలనాధికారి సందీప్‌కుమార్‌ ఝా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో 4025 కొలాం గిరిజన కుటుంబాలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 15 మండలాలు ఉండగా, ప్రతి మండలంలో 50 నుంచి 60 క్వింటాళ్ల బియ్యం నిల్వలు ఉన్నాయి.

విద్యార్థుల ఇంటికి ఇస్తే ప్రయోజనం

ప్రస్తుత సమయంలో పాఠశాలలకు విద్యార్థులు ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశాలు లేవు. ఈ తరుణంలో ఆయా పాఠశాలల పరిధిలో ఉన్న విద్యార్థుల ఇంటికే బియ్యం అందిస్తే నిరుపేద చిన్నారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇంటి వద్దకే వెళ్లి అంగన్‌వాడీ కార్యకర్తలు సరకులు అందజేస్తున్నారు.

జిల్లాలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు: 908

మాధ్యమిక ఉన్నత పాఠశాలలు: 180

ప్రాథమికోన్నత పాఠశాలలు: 170

విద్యార్థుల సంఖ్య: 88,119

పాఠశాలల్లో నిల్వ ఉన్న బియ్యం: 868.11 క్వింటాళ్లు

ABOUT THE AUTHOR

...view details