కుమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం తరలింపు వివాదం సద్దుమణిగింది. కార్యాలయాన్ని తరలించడాన్ని అడ్డుకుంటూ... గ్రామస్థులు ఆందోళన చేపట్టగా అధికారులు వెనక్కి తగ్గారు. తాత్కాలికంగా మండల కేంద్రంలోని అంగన్వాడీ భవనంలో కొనసాగించేందుకు ఏర్పాటు చేశారు. జిల్లాలో నూతనంగా ఏర్పడిన మండలాల్లో ప్రభుత్వ భవనాలు లేకపోవడం వల్ల ప్రైవేటు అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు.
'సద్దుమణిగిన తహసీల్దార్ కార్యాలయం తరలింపు వివాదం' అద్దె విషయంలో సమస్య...
చింతలమానేపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయం కూడా మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ భవనంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో భవన యజమానితో అద్దె విషయంలో సమస్య నెలకొంది. ప్రస్తుతం అద్దె రూ. 8,000 చెల్లిస్తుండగా.. రెట్టింపు ఇవ్వాలని లేదంటే ఖాళీ చేయాలని డిమాండ్ చేయగా అధికారులు మండలకేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో గల రవీంద్రనగర్లోని ప్రభుత్వ పాఠశాలకు తరలించేందుకు యత్నించారు.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు కార్యాలయం తరలించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుని ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలో బంద్ చేపట్టారు. ఈ విషయంలో పలువురు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని తహసీల్దార్ కార్యాలయం మండల కేంద్రంలోనే కొనసాగించాలని ఉన్నతాధికారులను కోరగా.. తాత్కాలికంగా అంగన్వాడీ భవనంలో కొనసాగించేలా ఏర్పాటు చేశారు. సమస్య తీరడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి:పిల్లల్లో కరోనా చిత్తు..! కారణం ఇదే