తెలంగాణ

telangana

ETV Bharat / state

15 ఏళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు.. విసిగిపోతున్న రైతులు

సమైక్య రాష్ట్రంలో నిర్మాణ పనులు ప్రారంభమైన ఓ మధ్య తరహా ప్రాజెక్టు నేటికీ నిర్మాణ దశలొనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతం మీద చిత్తశుద్ధి లేక ప్రాజెక్టును పట్టించుకోలేదనునకుంటే.. స్వరాష్ట్రం ఏర్పడినా ప్రాజెక్టు ప్రారంభానికి నోచుకోవడంలేదు. మంత్రులు వచ్చి ప్రాజెక్టు పనులను పరిశీలించినా చుక్కనీటిని ఒడిసి పట్టలేక ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు.

By

Published : Oct 1, 2020, 9:25 PM IST

project works pending due Since !5 Years In Kumuram Bheem District
15 ఏళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు.. విసిగిపోతున్న రైతులు

కుమురం భీమ్ జిల్లా కాగజ్​నగర్ మండలంలోని జగన్నాథపూర్ పెద్దవాగుపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్​రెడ్డి 2006లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. పనులు ప్రారంభమై 15 ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు నిర్మాణం మాత్రం ఇంకా పూర్తి కాక.. ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగజ్ నగర్, దహేగం మండలాల్లోని సాగుభూమికి నీరందించాలన్న లక్ష్యంతో 2005లో జగన్నాథ్ పూర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్​ రెడ్డి 2006 జూన్ 5న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మొదట నిర్మాణ వ్యయంగా రూ.124.4 కోట్లకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ ప్రాజెక్టును రూ.118 కోట్ల వ్యయంలోనే నిర్మిస్తామని గామన్ ఇండియా కంపెనీ టెండర్లు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు కింద 96 నిర్మాణాలు 29 కిలోమీటర్ల పొడవున నిర్మించే కాలువల ద్వారా 15వేల ఎకరాలకు సాగునీరు అందించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. అయితే ప్రాజెక్టు నిర్మాణంతో పాటు భూసేకరణలో ఏర్పడిన ఇబ్బందులతో ఏటా అంచనా వ్యయం పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ప్రాజెక్టు వ్యయం రూ.146 కోట్లకు పెంచగా.. ప్రస్తుతం రూ.244. 66 కోట్లకు చేరింది.

15 ఏళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు.. విసిగిపోతున్న రైతులు

కొత్త కంపెనీకి నిర్మాణ బాధ్యతలు..
జగన్నాథపూర్ ప్రాజెక్టును గడువులోపు పూర్తి చేయడం లేదని గామన్ ఇండియా కంపెనీకి పలుమార్లు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అయితే గడువు తీరే లోపు నిర్మాణం పూర్తి చేస్తామని సదరు కంపెనీ సంజాయిషీ ఇచ్చింది. మళ్ళీ 2013 -14లో రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి మరో అవకాశం కల్పించింది. అయినప్పటికీ పనుల్లో జాప్యం జరగడం వల్ల నిర్మాణ బాధ్యతల నుంచి సదరు కంపెనీని తొలగించింది. నిలిచిపోయిన పనులతోపాటు, కొత్తగా చేపట్టాల్సిన పనుల కోసం సర్కారు టెండర్లు పిలిచింది. ప్రభుత్వాన్ని సవాల్​ చేస్తూ.. గామన్ ఇండియా కంపెనీ కోర్టుకు వెళ్లింది. విషయం కోర్టుకు చేరడం వల్ల ప్రాజెక్టు భవితవ్యం సందిగ్ధంలో పడింది. కోర్టు పరిధిలో కేసు ఉండడం వల్ల అప్పట్లో ఏడాదికాలంగా ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది. నీటిపారుదల శాఖ తరఫున ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్, గామన్ ఇండియా కంపెనీ న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో మిగిలిన పనులు గామాన్ ఇండియా కంపెనీకే అప్పగించాలని.. నూతనంగా చేపట్టాల్సిన పనులు ఇతర కంపెనీకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

బకాయిలు చెల్లించక.. ఆగిపోయింది!
కోర్టు తీర్పు అనంతరం ప్రస్తుతం ఎవరి పరిధిలో వారు పనులు చేపడుతున్నారు. పెంచిన అంచనా వ్యయం ప్రకారం ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం రూ.244. 66 కోట్లకు చేరుకుంది. తాజాగా చేర్చిన పనులతోపాటు ప్రాజెక్టును 2019 మార్చి వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయినప్పటికీ పనులు పూర్తి కాక పోవడం వల్ల 2019 డిసెంబర్ వరకు మరోసారి గడువు పెంచింది. ప్రస్తుతం పెంచిన గడువు ముగిసి ఎనిమిది నెలలు గడిచినా ప్రాజెక్టుపై ప్రభుత్వం పట్టింపు కరువైంది. కాగజ్​నగర్ నుంచి దహెగం వరకు ప్రధాన కాలువ నిర్మాణ పనులు 88శాతం పూర్తయినప్పటికి.. డిస్ట్రిబ్యూషన్ కాలువల నిర్మాణాలు పూర్తి కావాల్సిఉంది. పలుచోట్ల కాలువ నిర్మాణంలో భూ నిర్వాసితులకు పరిహారంలో చెల్లింపులు జరగలేదు. ఈ కారణంగా కాలువల నిర్మాణ పనులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం సైతం నిధులు మంజూరు చేయకపోవడం వల్ల పనులు చేపడుతున్న కాంట్రాక్టు కంపెనీ తన కార్యాలయాన్ని మూసివేసింది. సుమారు రూ.12 కోట్ల బిల్లు రావాల్సి ఉండటం వల్ల చేసేదేం లేక కంపెనీ చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. గత 18 నెలలుగా సిబ్బందికి వేతనాలు చెల్లించక వారు కూడా పనులు మానేసి ఇంటి ముఖం పట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వల్ల చేతిలో ఉన్న ఉపాధి పోయిందని కూలీలు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు స్థలానికి భారీగా నీరు చేరుతున్నప్పటికీ గేట్లు ఎత్తి వరద నీటిని వాగుల్లోకి వదులుతున్నారు.

ఇవీ చూడండి: 'మరోసారి తెలంగాణ జోలికి రాకుండా సమాధానం ఇవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details