Pranahitha pushkaralu: ప్రాణహిత పుష్కరాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి, మహారాష్ట్రలోని సిరోంచ, నగరం పుష్కర ఘాట్లన్నీ భక్తులతో సందడిగా మారాయి. ఆర్టీసీ, టూరిస్టు బస్సులు, ప్రైవేటు వాహనాల్లో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. పితృదేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు నిర్వహించారు. మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. గౌరీ, కుంకుమ పూజలు నిర్వహించి, నదిలో పూలు, పండ్లు, దీపాలు వదిలారు. చివరిరోజు అర్జునగుట్ట వద్ద సుమారు 1.10 లక్షల మంది, వేమనపల్లి వద్ద 50 వేల మంది, తుమ్మిడిహెట్టిలో 30 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారని సమాచారం. రాత్రి ఘాట్ల వద్ద కలశ పూజను నిర్వహించి, పంచామృతాలు, పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించారు. ఈ నెల 13న ఆరంభమై 12 రోజుల పాటు వైభవంగా జరిగిన పుష్కర క్రతువును హారతినిచ్చి పరిసమాప్తం చేశారు.
కుమురం భీం జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహట్టి గ్రామంలో పుష్కరాల ముగింపు రోజున ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ కోవ లక్ష్మి పాల్గొని ప్రాణహితకు గంగా హారతి సమర్పించారు. 12 రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రాణహిత నదిలో పుష్కర స్నానమాచరించి పుణీతులయ్యారు.