పారిశ్రామిక రంగంపై కరోనా తీవ్రంగా ప్రభావం పడుతోంది. కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లును యాజమాన్యం ఈ నెల 5 నుంచి 15 వరకు షట్‌డౌన్ ప్రకటించింది. ఇటీవల ఓ ఉద్యోగికి కరోనా లక్షణాలు రావడంతో పరీక్షల నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ముందు జాగ్రత్తగా మిల్లుకు షట్‌డౌన్ ప్రకటించారు.
లాక్‌డౌన్ సమయంలోనూ ఎస్పీఎం యాజమాన్యం వేతనాలు చెల్లించింది. ఆంక్షల సడలింపు అనంతరం మే 20 నుంచి కాగితం ఉత్పత్తిని ప్రారంభించింది. హైదరాబాద్, నాగ్‌పూర్, దిల్లీ, ముంబయి, లఖ్‌నవూ, అహ్మదాబాద్ తదితర కేంద్రాలకు సరఫరా చేస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. నిల్వలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో షట్‌డౌన్ గడువును యాజమాన్యం మరింత పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.