అతివేగంగా వస్తున్న ఓ వ్యాన్ను పట్టుకునేందుకు మహారాష్ట్ర పోలీసులు ముమ్మర ప్రయత్నం చేశారు. సినిమా తరహాలో ఛేజింగ్(Police chasing) చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు డీసీఎంలో దాదాపు 20 నుంచి 30 పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు మహారాష్ట్ర లాటీ పోలీసు అధికారులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... సోనాపూర్ గ్రామస్థులకు సమాచారం అందించారు. పలువురు స్థానిక యువకులు ఆ రహదారిపై ఎడ్లబండ్లు, డ్రమ్ములను ఏర్పాటు చేసి... వ్యాన్ నిలుపుదలకు యత్నించారు. కానీ ఆ వ్యాన్ డ్రైవర్ ఆపకుండానే రోడ్డుకు అడ్డంగా వేసిన ఎడ్లబండ్లను, డ్రమ్ములను ఢీకొని కాగజ్ నగర్ వైపు అతివేగంతో దూసుకెళ్లారు.
వంతెనపై ఇరుక్కుపోయిన జీపు
ఆ వ్యానును అడ్డుకునేందుకు లాటీ పోలీసులు జీపు, గ్రామస్థులు కారుతో వెంబడించారు. ఆ వ్యాన్ కాగజ్ నగర్ రైల్వే పైవంతెన నుంచి అతివేగంగా పోతుండగా పట్టణవాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో పోలీసుల జీపు ప్రమాదవశాత్తు కాగజ్ నగర్ రైల్వే పైవంతెన సమీపంలోని రహదారి డివైడర్ల మధ్యలోకి ఇరుక్కుపోయి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాగజ్ నగర్ టౌన్ పీఎస్ఐ తేజశ్విని ఘటన స్థలాన్ని సందర్శించి... మహారాష్ట్ర పోలీసులతో వివరాలను సేకరించారు. రెబ్బెన, ఆసిఫాబాద్, మంచిర్యాల పోలీసులకు ఆ వ్యాన్ విషయమై సమాచారం అందించినప్పటికీ ఆచూకీ లభించలేదు.