కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలుల వీయడం వల్ల చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో కోసి ఆరబెట్టిన వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షానికి గురికావడం వల్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు టార్పాలిన్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల కుప్పలు పోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.
అకాల వర్షంతో.. చేతికొచ్చిన పంట నష్టం!
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చేతికొచ్చిన పంట అకాల వర్షం పాలయింది. జిల్లా పరిధిలోని రెబ్బెన మండలంలో పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా చేతికొచ్చిన పంట వర్షంలో తడిసి ముద్దయింది. కోసి ఆరబెట్టిన వరిధాన్యం వర్షానికి తడిసిపోవడం వల్ల రైతులు ఆవేదన చెందుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినా.. తేమ పేరుతో అధికారులు వరిధాన్యం కొనుగోలు చేయడం లేదని.. ధాన్యాన్ని ఎండబెడితే అకాల వర్షానికి ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని రైతులు ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో ఒక్కసారి అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చిందని కన్నీరు పెట్టుకున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:మంత్రి జగదీశ్‌రెడ్డి వర్సెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి