కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని కందిభీమన్న అటవీ ప్రాంతంలో అధికారులు ఉంచిన ఎరను 11న తిన్న పులిని బంధించేందుకు సమీపంలోనే మంచెను ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో పులి ఇక్కడికి రెండుసార్లు వచ్చి మిగిలిన మాంసాన్ని తిన్నప్పటికీ ఈ వేళల్లో మత్తుమందు ప్రయోగించడానికి వీలుకాకపోవడం పులికి కలిసొచ్చింది. ప్రశాంతంగా ఉండే అడవిలో మంచెలు కనిపించడం, సిబ్బంది సంచారంతో ఏర్పడిన శబ్దాలతో ప్రమాదం పసిగట్టిన పులి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 14 నుంచి పులి కదలికల ఆచూకీ లభించలేదు. కందిభీమన్న అటవీ ప్రాంతానికి అయిదు కిలోమీటర్ల దూరంలో, నందిగాం పక్కనే ప్రాణహిత నదిని దాటి తాడోబా అభయారణ్యానికి పులి వెళ్లినట్లుగా సిబ్బంది గుర్తించారు. బెజ్జూరు మండలంలో రెండు ఆడపులులు తిరుగుతున్నందున వాటికోసం అది మళ్లీ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.