తెలంగాణ

telangana

ETV Bharat / state

అడవిలో అలజడి.. కాపు కాస్తున్న అధికారులు - komaram bheem bejjur area tiger

గత కొద్దిరోజులుగా కుమురం భీం జిల్లాలో అలజడి సృష్టిస్తున్న వన్య మృగాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎరగా వేసిన పశువును హతమార్చడంతో ఆ ప్రదేశంలో మంచెలు ఏర్పాటు చేసుకుని పులి రాక కోసం ఎదురు చూస్తున్నారు. రేపో మాపో పులిని బంధిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

officials-cultivating-in-asifabad-forest-for-tiger
అడవిలో అలజడి.. కాపు కాస్తున్న అధికారులు

By

Published : Jan 15, 2021, 9:51 PM IST

అడవిలో అలజడి.. కాపు కాస్తున్న అధికారులు

గతేడాది కుమురం భీం జిల్లాలో ఇద్దరిని హతమార్చిన పులి ఒక్కటే అని అధికారులు గుర్తించారు. మనుషులపై దాడి చేసిన పులి మహారాష్ట్రకు వెళ్లింది అనుకున్నారు. కానీ ఆ పులి బెజ్జూరు మండలం తలాయి కంది భీమన్న అటవీ ప్రాంతంలో తచ్చాడుతున్నట్లు నిర్ధరణకు వచ్చారు.

ప్రత్యేక నిఘా

పులి సంచరిస్తున్న ప్రాంతంలో ఒక పశువును ఎరగా వేసి సమీపంలో మంచెలు ఏర్పాటు చేసుకుని నిరీక్షిస్తున్నారు. ఎరగా వేసిన పశువును పులి హతమార్చడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు.. మహారాష్ట్ర నుంచి ట్రాంక్విలైజర్ (మత్తు మందు ఇచ్చే సిబ్బంది) టీమ్, రాపిడ్ రెస్క్యూ బృందం, టైగర్ ట్రాకర్ బృందాలను రప్పించారు. పశువును చంపిన చోటుకు పులి మళ్లీ వచ్చే అవకాశం ఉండటం వల్ల సమీపంలోని మంచెలపై కాపు కాస్తున్నారు. పశువుపై దాడి చేసిన పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పులి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

క్యాంపు వద్దే మకాం

మృతి చెందిన పశువు కళేబరం వద్దకు పులి రెండు పర్యాయాలు వచ్చినప్పటికీ.. ఆ సందర్భం ఎన్​టీసీఏ నిబంధనలకు విరుద్ధంగా ఉండటం వల్ల పులిపై మత్తు మందు ప్రయోగించలేకపోయామని అధికారులు వెల్లడించారు. పులిని బంధించే ప్రక్రియను ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్​కుమార్, కుమురం భీం జిల్లా డీఎఫ్ఓ.శాంతరాం, కాగజ్​నగర్ ఎఫ్డీఓ విజయ్ కుమార్ క్యాంపు వద్దే మకాం వేశారు.

బంధించి తీరుతాం

క్షేత్ర స్థాయిలో సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. క్యాంపు వద్ద హద్దులు ఏర్పాటు చేసి ఇతరులను ఎవరిని లోనికి అనుమతించటం లేదు. పాత్రికేయులను సైతం లోనికి అనుమతించకపోవటంతో అడవిలో ఏం జరుగుతుందో కచ్చితమైన సమాచారం ఎవరికీ తెలియడం లేదు. ఏది ఏమైనప్పటికీ పులిని కచ్చితంగా బంధించి తీరుతామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి :రాష్ట్ర వ్యాప్తంగా రేపు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details