జల్... జంగల్... జమీన్... నినాదాలతో నిద్రాణమై ఉన్న ఆదివాసుల్లో చైతన్య బావుట ఎగురవేసిన... కుమురం భీం పోరాటానికి ఊపిరిలూదిన రణక్షేత్రమే జోడేఘాట్. పరిసరాల్లోని 12 ఆదివాసీ గ్రామాలన్నీ దట్టమైన అడవులతో కూడి... ఎత్తైన కొండల మద్య... శత్రుదుర్భేద్యంగా ఉండడంతో పాటు... భీం పోరాటానికి కలిసి వచ్చింది. రణక్షేత్రంగా నిలిచింది. కానీ... కోవర్టు సమాచారంతో జోడేఘాట్ గుహల్లో నిద్రిస్తున్న స్థావరంపై 1940లో అశ్వయుజ పౌర్ణమి రోజున నిజాం సైన్యం జరిపిన కాల్పుల్లో భీం అసువులు బాశారు. అప్పటి నుంచి భీం పోరాట పటిమ ప్రాచుర్యం పొందినట్లే... జోడేఘాట్ ఖ్యాతీ పెరుగుతూనే వస్తోంది. కానీ అక్కడ ప్రభుత్వం రూ.25 కోట్లతో నిర్మించిన మ్యూజియం తప్ప... ఆదివాసీ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు కనిపించడంలేదు.
దాదాపుగా 500లోపు జనాభా కలిగిన జోడేఘాట్ గూడెం కనీస మౌలిక వసతులు నోచుకోవడంలేదు. అక్కడి ప్రజల బతుకుల్లో ప్రగతి కనిపించడంలేదు. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తోన్న జోడేఘాట్‌లోని ఆదివాసీలకు ఒక్కరికీ పక్కా ఇళ్లులేదు. అడవిలో లభించే వెదురుకర్రతో నిర్మించుకున్న ఇళ్లే వారికి ఆధారం. గతంలో కొంతమందికి మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా అర్ధంతరంగానే మిగిలింది. తాగేందుకు కనీసం రక్షిత మంచినీరు అందుబాటులో లేదు. గ్రామంలో ఉన్న ఒక్క బావి ద్వారా సరఫరా అయ్యే నీరు దాహాం తీరుస్తోంది. అదీ పనిచేయకుంటే నీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిందే. మిషన్ భగీరథ జాడే లేదు. కుమురం భీం అసువులు బాసి ఏడు దశాబ్దాలు గడిచినా జోడెఘాట్‌కు బస్సు సౌకర్యం లేదు.