No Bridge No Election flexis in Asifabad :కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్నటువంటి గుండి గ్రామానికి 2006లోవంతెన నిర్మాణం అప్పటి ప్రభుత్వం చేపట్టగా.. ఇప్పటికి 17 ఏళ్లు గడిచి రెండు ప్రభుత్వాలు మారాయి. కానీ, వంతెన నిర్మాణం పూర్తి కాలేదని గుండి గ్రామ ప్రజలు, యువత ఆవేదన చెందుతున్నారు. దీనిలో భాగంగా 2023లో జరుగుతున్న శాసనసభ ఎన్నికలను బహిష్కరించడానికి గుండి గ్రామ ప్రజలు, యువత ఏకతాటిపైకి వచ్చారు. 17 ఏళ్ల నుంచి గుండి వాగు పైన కడుతున్న వంతెన ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో.. వైద్య, విద్య పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. వర్షాకాలం వచ్చిందంటే నాలుగు నెలలు విద్యకు, వైద్యానికి దూరమై.. ప్రాణాలు పోయిన ఘటనలు, శిశు మరణాలు ఎన్నో జరిగాయని ఆవేదన చెందుతున్నారు.
Gundi Bridge Construction Issue :బ్రిడ్జి నిర్మాణం విషయంలో 2016లో అప్పుడున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు గుండి గ్రామ ప్రజలు పాదయాత్ర చేస్తూ వంతెన నిర్మాణం చేయాలని వినతిపత్రం సమర్పించారు. అయినప్పటికీ పూర్తి కాలేదని తెలిపారు. 2006 నుంచి 2023 వరకు నాయకులు వంతెన నిర్మాణం చేస్తామని హామీలు ఇచ్చినప్పటికీ పూర్తి కాలేదని తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గుండి గ్రామ ప్రజలు పేర్కొన్నారు. ఇప్పటివరకు వంతెన పూర్తి కాకపోవడంతో నో బ్రిడ్జ్, నో ఎలక్షన్ అంటూ గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామం లోపల కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Asifabad Bridge Issue : వంతెన లేక నిత్యం వెతలే.. వాగు దాటాలంటే చాలు గుండెల్లో గుబులే!