కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల పరిధిలోని ధనోరాలో సాగు చేస్తున్న యాపిల్ పంట క్షేత్రాన్ని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. అసిఫాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన పంట సాగు విధానంపై నిర్వహించిన రైతు సదస్సుకు వెళ్తున్న మంత్రి మార్గమధ్యంలో ధనోరా గ్రామంలో సాగు చేస్తున్న యాపిల్ పంటను పరిశీలించారు. రైతు కేంద్రె బాలాజీ యాపిల్ పంట క్షేత్రాన్ని మంత్రి సందర్శించి.. పంట సాగుకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక శాసన సభ్యుడు ఆత్రం సక్కు, డీసీసీబీ ఛైర్మన్ నాందేవ్ కాంబ్లే కూడా మంత్రి వెంట ఉన్నారు. చేతికొచ్చిన పంటకు సంబంధించి చర్చించడానికి ఈ నెల 29న రైతు బాలాజీని ముఖ్యమంత్రిని కలిసే ఏర్పాటు చేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.
జిల్లాలోని ఆదివాసీ భవనంలో ఏర్పాటు చేసిన నియంత్రిత పంటల సాగుపై అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. రైతులు ఆర్థికాభివృద్ధికి 14 సూత్రాలను పాటించాలని, రైతుల మేలు కోసమే పంట మార్పిడి చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూచించిందన్నారు. కరోన కట్టడిలో తెలంగాణ ప్రభుత్వము ఖచ్చితంగా మాస్కులు, హ్యాండ్ వాష్ వాడాలి అని తెలిపినప్పటికీ సదస్సులో చాలామంది అధికారులు, ప్రజా ప్రతినిధులు జాగ్రత్తలు పాల్గొనకుండా పాల్గొన్నారు. నియంత్రిత సాగు పద్ధతిలో ప్రభుత్వం సూచించిన పంటలు వేస్తే.. రైతులు అన్ని విధాల లాక్షపడుతారని మంత్రి వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో నియంత్రిత పంట సాగు విధానం దేశంలోనే ఒక విప్లవం సృష్టించనుందని మంత్రి తెలిపారు. నియంత్రిత పంట సాగు విధానానికి రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవ తీర్మానం రావడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున గోదాములను ఏర్పాటు చేశామని, కొత్త మండలాలకు అవసరమైన గోదాములు ఏర్పాటు చేయడానికి స్థలాన్ని గుర్తించి నివేదికలు పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు.