Harish rao in Asifabad: ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. జిల్లాలో రూ.60 కోట్లతో 340 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలోని అంకుసపూర్లో 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో నూతన జిల్లా ఆస్పత్రి, రేడియాలజీ ల్యాబ్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. జిల్లా ప్రజాప్రతినిధులు పూర్ణకుంభంతో వేదమంత్రాలతో మంత్రికి స్వాగతం పలికారు.
ఆస్పత్రులు నిర్మించడమే కాకుండా వైద్య సిబ్బందని తగినస్థాయిలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మారుమూల గిరిజన గ్రామంలో ఏఎన్ఎం సబ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా పాలనాధికారిని ఆదేశించారు. అసిఫాబాద్, కాగజ్‌నగర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కోరిక మేరకు డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రం నుంచి మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తామన్నారు. తెలంగాణ వచ్చాక తండాలు, గూడెలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. ఆస్పత్రి నిర్మాణ అనంతరం వైద్య కళాశాలను ఏర్పాటు చేయడాన్ని కేసీఆర్ సుముఖంగా ఉన్నారని అన్నారు.